మధ్యాహ్న భోజన పతనం

3 Jan, 2015 03:03 IST|Sakshi
మధ్యాహ్న భోజన పతనం

ఓ వైపు మధ్యాహ్న భోజనానికి అధికారులు తమ సమీక్షా సమావేశాల్లో పక్కా ప్రణాళికలతో లెక్కలు కడుతుంటే ఇంకోవైపు క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఆకలికేకలు వేస్తున్నా పట్టించుకోని వైనం. ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకం అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా  పతనావస్థకు చేరుకుంటోంది. ఎక్కడో...ఏ మూలనో ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జిల్లా అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు పక్కా ప్రణాళికల రచనలు ఆచరణలో వెక్కిరిస్తూనే ఉన్నాయి.
 
మాటల్లోనే ప్రణాళిక

జిల్లాలో 2015-16 విద్యాసంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను పక్కాగా రూపొందించాలని జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ మండల విద్యాధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం వార్షిక ప్రణాళికపై శుక్రవారం స్థానిక సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి సమావేశం హాలులో నిర్వహించిన ఎంఈఓల సమావేశంలో డీఈఓ మాట్లాడారు. వంట గదులు కూడా సత్వరమే పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.

ఆకలికేకలు
మార్టూరు మండలం పున్నూరు లోని జెడ్పీ హైస్కూల్‌లో గత రెండు నెలలుగా మధ్యాహ్న భోజనం బంద్ అయినా సంబంధితాధికారులు పట్టించుకోనేలేదు. ఈ పాఠశాలలో 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 190 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కావడం గమనార్హం. వంట ఏజెన్సీలు లేరనే సాకుతో పస్తులు పెడుతున్నారు.
 
పూనూరు (మార్టూరు)
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం కుకింగ్ ఏజెన్సీ లేక రెండు నెలలుగా నిలిచిపోయింది. మండలంలోని పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 220 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 190 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందినవారు కాగా..30 మంది ఓసీ విద్యార్థులున్నారు. పాఠశాలలో గతంలో వంట చేస్తున్న ఏజెన్సీ మానేసి రెండు నెలల పైనే అయింది.

నూతన ఏజెన్సీని నియమించడమో లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. నవంబర్ నుంచి ఇప్పటి వరకు పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం మానేశారు. పాఠశాలలో చదివేది ఎక్కువ మంది పేద విద్యార్థులే. వారు ఇంటికి వెళ్లి తిని పాఠశాలకు వస్తున్నారు. రెండు నెలలుగా తమ పిల్లలకు బడిలో మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకుని వెంటనే పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు