కళంకితురాలికి కేబినెట్ పదవా?

10 Sep, 2014 01:49 IST|Sakshi
కళంకితురాలికి కేబినెట్ పదవా?

ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ గిరిజన ఎమ్మెల్యేలు
 
హైదరాబాద్: తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సబబు కావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, రాజన్నదొర, రాజేశ్వరిలు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మిని కలసి ఆ మేరకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... ఎంపీ గీత అసలు ఎస్టీ కాదని, అలాంటప్పుడు ఆమెను పదవి నుంచి తొలగించి తగిన చర్యలు చేపట్టాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధతో జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించేందుకు కేంద్రానికి సిఫార్సు చేయాలని చూడడం సిగ్గుచేటని విమర్శించారు. సాధారణ ఎంపీగా ఉండేదానికన్నా కేబినెట్ ర్యాంకు హోదాను పొందితే ప్రజా ధనాన్ని దోచుకోవచ్చనే దుర్బుద్ధితోనే కొత్తపల్లి గీత టీడీపీతో కుమ్మకైందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది వ్యక్తిగత లబ్ధికోసమే ఆమె తెలుగుదేశం పంచన చేరారని వారు దుయ్యబట్టారు.
 

మరిన్ని వార్తలు