అసత్య వార్తలు పోస్ట్ చేస్తే చర్యలు

13 Jun, 2016 02:36 IST|Sakshi
అసత్య వార్తలు పోస్ట్ చేస్తే చర్యలు

జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరిక
రాజమహేంద్రవరం క్రైం : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షకు సంబంధించి సోషల్ మీడియాలో అసత్య వార్తలు, ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రామ్ మెసేజ్‌స్ తదితర సోషల్ మీడియాలో అసత్య వార్తలు వస్తున్నాయని తెలిపారు.

దీనివల్ల ప్రజలు భయాందోళనలకు గురై, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. ఇవి సైబర్ నేరాల్లోకి వస్తాయని, వాటిపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వంద శాతం అసత్య ప్రచారాలే ఉంటున్నాయని తెలిపారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలు వాస్తవమని ప్రజలు గ్రహించాలని వివరించారు.

దీక్ష చేపట్టాక పురుగు మందు తాగుతానని, ఆత్మహత్య ప్రేరణకు యత్నించడంతో.. ముద్రగడను కాపాడే చర్యల్లో భాగంగా ఆయనను అరెస్టు చేసి, ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. తొలి రోజున ఆస్పత్రికి తీసుకువచ్చిన పది నిమిషాల్లో ఆయన కడుపులో ఏమైనా పురుగు మందు ఉంటే శుభ్రం చేసేందుకు ప్రయత్నించిన వీడియో క్లిప్పింగ్‌ను సోషల్ మీడియా తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు.

కాపు జేఏసీ ఛలో రాజమహేంద్రవరానికి పిలుపునిచ్చిన సందర్భంగా దానిని అడ్డుకుంటామని చెప్పారు. ఇప్పటికే సెక్షన్ 30, 144 అమలులో ఉన్నాయని, సభలు, సమావేశాలకు అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా ముద్రగడ దీక్ష నేపథ్యంలో 160 మందిని అదుపులోకి తీసుకున్నామని, 60 మందిని గృహ నిర్బంధంలో ఉంచామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు