హమ్మ బాబూ.. అప్పటి పెట్టుబడులూ మీ ఖాతాలోకా!?

24 Apr, 2018 04:00 IST|Sakshi

పెట్టుబడుల విషయంలో సీఎం డాష్‌బోర్డు ద్వారా అసత్య ప్రచారం

గత ప్రభుత్వాల హయాంలో వచ్చినవీ ఇప్పుడు వచ్చినట్లు చూపుతున్న వైనం

ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.15,91,835 కోట్ల విలువైన ఒప్పందాలు

ప్రాథమిక దశ దాటని 66 శాతం పెట్టుబడుల ఒప్పందాలు

సాక్షి, అమరావతి: లక్షల కోట్ల ఒప్పందాలు.. లక్షల్లో ఉద్యోగాలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదన్న విషయాన్ని సీఎం కోర్‌ డాష్‌బోర్డు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన పెట్టుబడులను కూడా ఈ లెక్కల్లో కలిపి చూపిస్తున్నారు. ఉత్పత్తి ప్రారంభించాయని చెబుతున్న ప్రాజెక్టుల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కోర్‌ డాష్‌బోర్డు ప్రకారం ఇప్పటి వరకు విశాఖపట్నంలో జరిగిన మూడు భాగస్వామ్య సదస్సులతో పాటు ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లినపుడు రూ. 15,91,835 కోట్ల విలువైన 2,769 ఒప్పందాలు జరిగాయి.

ఈ ఒప్పందాలు అన్నీ అమల్లోకి వస్తే 36,86,865 మందికి ఉపాధి లభిస్తుందని డాష్‌బోర్డులో పేర్కొన్నారు. కానీ వీటిలో 66 శాతం పెట్టుబడులు కనీసం ప్రాజెక్టు రిపోర్టులు, భూ కేటాయింపులు వంటి ప్రాథమిక దశ కూడా దాటలేదు. అంటే రూ. 10,47,662 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇందులో ఈ సంవత్సరం ఒప్పందం కుదుర్చుకున్న రూ. 1,97,424 కోట్ల ఒప్పందాలు అమల్లోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. గత నాలుగేళ్లలో కుదుర్చుకున్న ఒప్పందాలను పరిశీలిస్తే ఉద్యోగ కల్పన అంతంతమాత్రమే అని స్పష్టమవుతోంది. ఒప్పందాల సంఖ్యను చూస్తే 2,769 ఒప్పందాల్లో 63.24 శాతం ప్రాథమిక దశ కూడా దాటలేదు.


సీఎం డాష్‌ బోర్డులో రూ. 15,91,835 కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఉన్న గణాంకాలు (సర్కిల్‌లో) 

గతంలో ఉత్పత్తి ప్రారంభించినా..
ఈ నాలుగేళ్లలో రూ. 1,35,960 కోట్ల విలువైన పెట్టుబడులు ఉత్పత్తి ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ పెట్టుబడుల్లో చాలామటుకు గత ప్రభుత్వాల హయాంలోనే ఒప్పందాలు కుదుర్చుకున్నవే. అంతేకాకుండా మరికొన్ని అప్పట్లోనే ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. ఉదాహరణకు కృష్ణపట్నం వద్ద సెంబ్‌కార్ప్‌ గాయత్రి పవర్‌ 1,320 మోగా వాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఇప్పుడు ప్రారంభమైనట్లు, రూ. 8,580 కోట్లు పెట్టుబడులు ఇప్పుడే వచ్చినట్లు చూపిస్తున్నారు. అయితే వాస్తవంగా ఈ సంస్థ జూన్‌ 12, 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే విశాఖపట్నంలోని హెచ్‌పీఎస్‌ఎల్‌ రూ. 17,000 కోట్లతో విస్తరణ పనులు, హిందుజా థర్మల్‌ పవర్‌ రూ. 5,455 కోట్లు, పెప్సికో రూ.1,230 కోట్లు, క్యాడ్‌బరీ రూ. 1,000 కోట్లు, ఇసుజూ మోటార్స్‌ రూ. 1,500 కోట్లు, గమేసా రూ. 1,000 కోట్లు.. ఇలా చెప్పుకుంటే చాలా ప్రాజెక్టులు గత ప్రభుత్వ హాయంలోనే ఒప్పందాలు కుదుర్చుకొని పనులు ప్రారంభించాయి.

ఆర్థిక సాయం కూడా ఉత్పత్తేనా: దారుణమైన విషయం ఏమిటంటే సీఆర్‌డీఏ పరిధిలో హౌసింగ్‌ అండ్‌అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి ఇచ్చిన రూ.7,500 కోట్ల ఆర్థిక సాయాన్ని కూడా ఉత్పత్తి యూనిట్లలో చూపించారు. అదే విధంగా ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వేసిన వెంచర్లు, హోటళ్లు, విద్యాసంస్థలు వంటి వాటిని కూడా ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడుల కింద చూపించి ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు అనేకమందికి ఉపాధి కల్పించే కీలకమైన బందరు పోర్టు, పెట్రో కెమికల్‌ కారిడార్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ వంటి అతి ముఖ్యమైన ప్రాజెక్టులు నాలుగేళ్లగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. వీటికి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో లక్షలాదిగా ఉన్న నిరుద్యోగులు నిరాశలోనే ఉండిపోతున్నారు. 

మరిన్ని వార్తలు