హెచ్‌ఐవీ ఉందంటూ తప్పుడు నివేదిక

7 Oct, 2018 03:40 IST|Sakshi
ప్రభుత్వా ఆసుపత్రిలో ఇచ్చిన రిపోర్టులు, బయట ల్యాబ్‌లలో ఇచ్చిన రిపోర్టులు చూపిస్తున్న దంపతులు

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితురాలి కుటుంబం

నాలుగు ప్రైవేట్‌ ల్యాబుల్లో పరీక్షలు చేయగా హెచ్‌ఐవీ లేదని తేలిన వైనం

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం ధర్నా

తాడితోట (రాజమహేంద్రవరం): వివాహమై ఆరు నెలలైంది. గర్భిణి అని తెలియడంతో రక్త పరీక్షల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఆ యువతికి పిడుగులాంటి వార్త అందింది. తనకు హెచ్‌ఐవీ ఉందంటూ ఆస్పత్రి సిబ్బంది నివేదిక ఇచ్చారు. తనకు వచ్చే అవకాశమే లేదని బాధితురాలు వాపోయినా వినిపించుకోలేదు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరువు పోయిందని భావించిన ఆమె భర్త, ఆ కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, సన్నిహితుల సలహా మేరకు ప్రైవేట్‌ ల్యాబ్‌లో ఆ యువతి పరీక్షలు చేయించగా హెచ్‌ఐవీ లేదని రిపోర్టు వచ్చింది.

ఒకటి కాదు రెండు కాదు నాలుగు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించగా, హెచ్‌ఐవీ లేదనే తేలింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని నిరసనకు దిగారు. తప్పుడు నివేదిక ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరం సంతోష్‌నగర్‌కు చెందిన నల్లామట్టి నాని ఆటో డ్రైవర్‌. అతని భార్య మనీషా గర్భిణి. ఈ నెల 4న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు విభాగానికి వైద్య పరీక్షలకు వెళ్లింది. రక్త పరీక్షలు నిర్వహించేందుకు రక్తం శాంపిల్‌ తీసుకొని ఇంటికి పంపించేశారు.

మరుసటి రోజున ‘మీ భర్తను తీసుకొని ఆస్పత్రికి రండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది నుంచి ఫోన్‌ వచ్చింది. తన భర్తను వెంటబెట్టుకొని ఆమె హడావుడిగా వెళ్లింది. ‘నీకు హెచ్‌ఐవీ ఉందని’ ల్యాబ్‌ టెక్నీషియన్‌ చెప్పడంతో ఆ దంపతులు హడలిపోయారు. ‘నేను బయట తిరిగేదాన్ని కాదు. పెళ్లయి ఆరు నెలలైంది. నాకు హెచ్‌ఐవీ ఎలా వస్తుంది’ అంటూ ఆ యువతి విలపించినా పట్టించుకోకుండా ఆస్పత్రిలో ఉన్న హెచ్‌ఐవీ కౌన్సిలర్‌ లలిత బలవంతంగా హెచ్‌ఐవీ విభాగం (ఏఆర్‌టీ సెంటర్‌)కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, భీతిల్లిన ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయింది.

బాధితురాలి కుటుంబం ఆత్మహత్యాయత్నం
ఆ రిపోర్టుతో తీవ్ర మనోవేదనకు గురైన మనీషా 5న ఆత్మహత్య చేసుకునేందుకు బయటకు వెళ్లిపోతుండగా స్థానికులు రక్షించారు. ఆమె తల్లి, భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రిపోర్టు మీద నమ్మకం లేక మరో ల్యాబ్‌లో రక్త పరీక్షలు నిర్వహించగా హెచ్‌ఐవీ లేదని తేలింది.

మరో మూడు చోట్ల రక్త పరీక్షలు చేయించినా హెచ్‌ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్‌ టెక్నీషియన్ల నిర్లక్ష్యం వల్లే తప్పుడు రిపోర్టులు వచ్చాయని నిర్ధారణకు వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మశ్రీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

తప్పుడు రిపోర్టు ఇచ్చిన సిబ్బందిపై చర్యలు  
తప్పుడు రిపోర్టు ఇచ్చిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ రవిపైనా,  గర్భిణి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎయిడ్స్‌ కంట్రోల్‌ కౌన్సిలర్‌ లలితపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ టి.రమేష్‌ కిశోర్‌ తెలిపారు. ఇప్పటికే ఈ సంఘటనపై ఎంక్వెరీ వేశామని చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామన్నారు.

మరిన్ని వార్తలు