ఎవరికెవరు ఈ లోకంలో..

22 Jul, 2020 11:11 IST|Sakshi

కరోనా భయంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్న బంధువులు  

చివరి చూపు చూడడానికి సాహసించలేకపోతున్న స్నేహితులు  

చివరి మజిలీలో కనిపించని ఆప్తులు

కర్నూలు(హాస్పిటల్‌) :ఎంతో మందికి విద్యాబుద్ధులు చెప్పిన మద్దికెరకు చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు వేణుగోపాల్‌ శెట్టి(90) గత సోమవారం అనారోగ్యం (కరోనా కాదు)తో మృతిచెందారు. విషయం    తెలిసినా కరోనా భయంతో ఏ ఒక్కరూ ఆయనను కడచూపు చూసేందుకు రాలేదు. చివరకు ఆయనకు అంత్యక్రియలు చేసేందుకు సైతం ఎవ్వరూ లేని పరిస్థితి. దీంతో  కుటుంబ సభ్యులే ఆటోలో ఆయన భౌతిక కాయాన్ని శ్మశానికి తరలించి ఖననం చేశారు.  ప్యాపిలికి చెందిన ఓ వ్యాపారి(46) సైతం గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందాడు. అయితే ఆయన కరోనాతో చనిపోయాడని భావించి బంధువులు ఎవ్వరూ చూడటానికి రాలేదు. అంత్యక్రియలు నిర్వహించేందుకు భార్య, రెండేళ్ల కుమారుడు మినహా ఎవ్వరూ లేరు. విషయం తెలుసుకున్న అక్కడి ఎస్‌ఐ మారుతిశంకర్‌ సీపీవోలు పవన్, సత్య, జగదీష్, రాము, విజయ్‌ సహకారంతో రిక్షాలో మృతదేహాన్ని తీసుకుని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

కరోనాపై ఉన్న భయం సాధారణంగా మరణించిన వారిని చూసేందుకు, వారి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రానీయకుండా చేస్తోంది. ఎవరు కరోనాతో మరణించారో, ఎవరిది సాధారణ మరణమో తెలియడం లేదన్న అనుమానం కారణంగా దిక్కులేని మరణాలు అధికమవుతున్నాయి. ఒకప్పుడు ఎవ్వరైనా మరణిస్తేకుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు స్థానికులు అధికంగా వచ్చేవారు. కరోనా కాలంలో ఎంతటి వారికైనా చివరకు ‘ఆ నలుగురు’ సైతం లభించని దయనీయ పరిస్థితి నెలకొంది. 

కర్నూలులో ఓ డాక్టర్‌ ఎంతో మంది పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు అందించారు. ఈ ప్రాంత ప్రజలకే కాదు పక్క రాష్ట్రాల నుంచి సైతం వైద్యసేవలు పొందేందుకు వ్యయప్రయాసలకు ఓర్చి ఇక్కడికి వచ్చేవారు. ఆయన తన.. 50 ఏళ్ల సర్వీసులో కొన్ని వేల మందికి వైద్యం చేసి ప్రాణాలు పోసి ఉంటారు. అలాంటి  వ్యక్తి కరోనాతో మరణిస్తే..చూసేందుకు ఎవరూ రాలేని పరిస్థితి. వైరస్‌ వ్యాపిస్తుందని భయపడి ఉండవచ్చు..అయితే సాధారణ జబ్బులతో మృతిచెందిన వారి అంత్యక్రియలకు వెళ్లేందుకు సైతం జనం ముందుకు రావడం లేదు. ఎంత దగ్గరి వారైనా, స్నేహితుడైనా, బంధువైనా సరే ఇంటి వద్దకు వెళ్లి దూరం నుంచి మృతదేహాన్ని చూసి వస్తున్నారు. కొందరైతే సోషల్‌ మీడియాలోనే పరామర్శిస్తున్నారు. మరికొందరు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ‘రిప్‌’ అని ఇంగ్లీష్‌ అక్షరాల్లో సంతాపం ప్రకటించేసి ఇంట్లో ఉంటున్నారు. బతికున్నప్పుడు అతనితో అన్ని అవసరాలు తీర్చుకున్న వ్యక్తులు కడదాకా రాలేకపోతున్నారు. అంత్యక్రియలకు హాజరై తమ సంస్కారాన్ని చూపలేకపోతున్నారు. అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలోనైనా హాజరై భౌతిక దూరం పాటిస్తూ మరణించిన వ్యక్తికి నివాళి అర్పిస్తే ఎంత బాగుంటుందన్న చర్చా మొదలైంది. 

మరి వైద్యులు, సిబ్బంది ఎలా సేవ చేస్తున్నారు..?
ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలియదో, అతనికి ఎలాంటి జబ్బులు ఉన్నాయో వారికి అప్పటి వరకు అవగాహన ఉండదు. కానీ రోగి ఆసుపత్రికి వచ్చిన వెంటనే వారు ముందుంటారు. వెంటనే అతని ఆరోగ్య విషయాలు తెలుసుకుని, ఏమైందో తెలుసుకుని వైద్యం చేసేందుకు ఉపక్రమిస్తారు. అతనికి ప్రాథమిక వైద్యం అందిస్తూనే మరోవైపు కరోనా పరీక్షలు సైతం నిర్వహిస్తారు. ఇది నిత్యం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటి(అత్యవసర విభాగం)లో జరిగే ప్రక్రియ. రోగికి వైరస్‌ లేకపోతే ఓకే ..మరి వైరస్‌ ఉంటే అప్పటి వరకు వైద్యం చేసిన వైద్యులు, పనిచేసిన సిబ్బంది సైతం మనుషులే కదా. రోగి బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఆలోచించినట్లే వారు కూడా కరోనా వైరస్‌కు భయపడితే పరిస్థితి ఎలాగుంటుందో అర్థం చేసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్‌కు భయపడకూడదని, అవగాహన పెంచుకుని మసలుకుని మానవత్వం చాటలని వారు కోరుతున్నారు.  

భౌతిక దూరం పాటిస్తూ నివాళులర్పించవచ్చు
ఎవ్వరైనా కరోనాతో మృతి చెందితే గంట తర్వాత వైరస్‌ కూడా చనిపోతుంది. గంట తర్వాత మృతదేహం నుంచి మరొకరికి కరోనా సోకదు. అయితే మృతుల కుటుంబీకుల(కాంటాక్ట్స్‌)కు వైరస్‌ సోకి ఉండే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే ప్రభుత్వం మృతదేహాన్ని కుటుంబీకులకు ఇవ్వకుండా అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే సాధారణ జబ్బులతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో హాజరై భౌతిక దూరం పాటిస్తూ నివాళులు అర్పించవచ్చు.–డాక్టర్‌ కె. శ్రీనివాసరావు, సివిల్‌ సర్జన్‌ బ్యాక్టీరియాలజిస్ట్, రీజినల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబోరేటరీ, కర్నూలు

మరిన్ని వార్తలు