కడతేరిపోయేంత కష్టమేమొచ్చిందో?

11 Jan, 2014 02:11 IST|Sakshi

 పూత, పిందెలతో ఉన్న పచ్చని చెట్టు పెనుగాలికి కూకటివేళ్లతో నేలకూలినట్టు- పిల్లాపాపలతో కళకళలాడుతున్న ఓ కుటుంబం మృత్యువు ఒడిలో ఒరిగిపోయింది. నూరేళ్లు కష్టంలో, సుఖంలో తోడుగానీడగా ఉంటానన్న వాడే ఆమెను కడతేర్చాడో లేక ఏ కష్టానికి ఎదురీదలేకో వారిద్దరూ కలిసే కన్నబిడ్డలతో సహా కడతేరిపోవాలని నిర్ణయించుకున్నారో.. ఆ దంపతులు, వారి ఇద్దరి పాపలు.. ఎవరికీ చెప్పకుండా మౌనంగా, అంతుబట్టని మర్మంగా ఈ లోకం నుంచి నిష్ర్కమించారు. మూడు పదులు నిండకుండానే.. బహుశా.. తమ మరణశాసనం తామే రాసుకున్న ఆ ఇద్దరూ ముద్దుల మూటల్లాంటి తమ ఇద్దరు బిడ్డలను కూడా వెంట తీసుకుపోయారు.
 
 సాక్షి, రాజమండ్రి/న్యూస్‌లైన్, కంబాలచెరువు :
 రాజమండ్రి రిలయన్స్ మార్ట్‌లోని బేకరీలో చెఫ్‌గా పని చేసే రౌతు చిన్నమనాయుడు (28), అతడి భార్య లక్ష్మి (23), కుమార్తెలు తేజ (3), గాయత్రి (ఏడాదిన్నర) శుక్రవారం శేషయ్యమెట్టలోని వారి ఇంట్లో విగతజీవులై కనిపించారు. ఉదయం పదిన్నర సమయంలో పొరుగింటి పిల్లలు చిన్నమనాయుడి ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. ఎంత తట్టినా ఎవరూ పలకకపోయే సరికి పక్కనే ఉన్న కిటికీ లోంచి తొంగి చూడగా వేలాడుతున్న చిన్నమనాయుడి కాళ్లు కనిపించాయి. పిల్లలు చెప్పిన విషయాన్ని పెద్దలు వెంటనే పోలీసులకు తెలిపారు. డీఎస్పీ నామగిరి బాబ్జి, ట్రైనీ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐ రమేష్ ఆ ఇంటికి చేరుకుని వీఆర్వో సమక్షంలో తలుపులు పగులకొట్టారు. తల్లీబిడ్డల మృతదేహాలు నేలపై పడి ఉండగా చిన్నమనాయుడు ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు.
 
  తల్లీబిడ్డల మృతదేహాలనుంచి తీవ్ర దుర్గంధం రావడం, బ్లేడుతో కోసుకున్నట్టు చిన్నమనాయుడి ఎడమచేతి మణికట్టు నుంచి స్రవించిన నెత్తురు గడ్డ కట్టకుండా పల్చగా ఉండడంతో తల్లీబిడ్డలు మృతి చెంది రెండు రోజులవుతుందని, చిన్నమనాయుడు శుక్రవారం ఉదయమే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. తల్లీబిడ్డల నోటి నుంచి నురుగు రావడంతో వారి మృతికి విషమేదో కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. బుధవారమే భార్యాబిడ్డలకు విషమిచ్చిన నాయుడు రెండు రోజుల తర్వాతతొలుత మణికట్టు కోసుకుని, అనంతరం ఉరి వేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. అయితే లక్ష్మి మెడ పైన కూడా కమిలినట్టు ఉండడంతో రెండు రోజుల క్రితం ఆమె కూడా ఉరి వేసుకుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆమెను నాయుడు కిందకు దించి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఆ ఇంట్లో ఎలాంటి పురుగుమందుల డబ్బా కనిపించకపోవడంతో నాయుడు భార్యాబిడ్డల మరణం తర్వాత ఎక్కడో పారేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కానీ, ఎలాంటి విష పదార్థం కానీ కనిపించలేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చి, నాయుడి కుటుంబ నేపథ్యాన్ని క్షుణ్నంగా ఆరా తీస్తే తప్ప పూర్తి వివరాలు చెప్పలేమని డీఎస్పీ బాబ్జీ పేర్కొన్నారు.
 
 ఏ బలమైన కారణం బలిగొందో?
 చిన్నమనాయుడి కుటుంబం విషాదాంతానికి ఆర్థిక ఇబ్బందులే కారణ ం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నాయుడికి సొంత ఊరిలో అప్పులు ఉన్నట్టు తెలియడంతో పాటు ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంట్లో పడుకునేందుకు మంచం కూడా లేకపోవడం, వంట సామాన్లు కూడా చాలీచాలనట్టు ఉండడం, పోపుల పెట్టె నిండుకుని ఉండడం, బియ్యం నాలుగైదు కిలోలు మాత్రమే ఉండడాన్ని బట్టి ఆర్థికంగా చిక్కుల్లో ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. మృతదేహాల శారీరక పరిస్థితి, ముఖ కవళికలను బట్టి రెండురోజుల నుంచి భోజనం చేసి ఉండకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే చిన్నమనాయుడికి అప్పులేమీ లేనట్టు అతని కుటుంబీకులు చెబుతున్నారు. అలాంటప్పుడు కుటుంబ మంతా ఇలా అంతమైపోవడానికి ఏ బలమైన కారణం ప్రేరేపించి ఉంటుందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అయితే ఇంతకీ వీరు ఆత్మహత్య చేసుకునేందుకు మరో కారణం ఏమైనా ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి పెట్టారు.   
 
 ఆలుబిడ్డలంటే ఎంతో అపురూపం..
 శ్రీకాకుళం జిల్లా పాలకొండ సమీపంలోని లుంబూరుకు చెందిన చిన్నమనాయుడికి, అదే జిల్లా కొండాపురానికి చెందిన లక్ష్మికి 2009లో వివాహమైంది. తండ్రితో విభేదాలు తలెత్తడంతో చిన్నమనాయుడు భార్య, పిల్లలతో హైదరాబాద్ వెళ్లి ఓ బేకరీలో పనికి కుదిరాడు. అక్కడ బేకరీ వంటకాల తయారీలో నైపుణ్యం సంపాదించిన చిన్నమనాయుడు ఏడాదిన్నర కిందట రాజమండ్రి వచ్చి పుష్కరాల రేవు సమీపంలోని రిలయన్స్ మార్ట్ బేకరీలో రూ.12,500 జీతానికి చేరాడు. తండ్రితో పంతం కొద్దీ తన ఇంటి గడప తొక్కని నాయుడు మధ్య మధ్య అత్తగారింటికి మాత్రం వెళ్లి వచ్చేవాడు. నాయుడికి ఉద్యోగం, కుటుంబం తప్ప మరో వ్యాపకం లేదని, పెళ్లాం, పిల్లలను అపురూపంగా చూసుకునే వాడని సహోద్యోగులు అంటున్నారు. అలాంటి కుటుంబానికి ఎలాంటి కష్టం ఎదురై, ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారోనని కంట తడిపెడుతున్నారు. ఇరవై రోజుల క్రితం నాయుడి కుటుంబం అన్నవరం వెళ్లి దైవదర్శనం చేసుకుందని, ఇంతలోనే వారంతా శాశ్వతంగా ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయారని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఇలా చూస్తామనుకోలేదు..
 చిన్నమనాయుడు నెమ్మదస్తుడు. స్థానికంగా అప్పులు లేవు. కుటుంబాన్ని రాజమండ్రి తీసుకువచ్చే వరకూ లక్ష్మీవారపుపేటలో కొందరు స్నేహితులం అంతా కలిసి ఉండేవాళ్లం. తర్వాత ఇల్లు మారాడు. డ్యూటీ కచ్చితంగా చేసేవాడు. మంగళవారం సెలవు తీసుకున్న నాయుడు బుధవారం డ్యూటీకి వచ్చాడు. గురువారం  రాలేదు. ఇంటి వెళ్లేసరికి తాళం వేసి ఉంది. కానీ ఇప్పుడు ఇలా చూస్తామనుకోలేదు.
 - శ్రీను, చిన్నమనాయుడి సహోద్యోగి
 
 గుట్టుగా ఉండేవారు..
 శుక్రవారం ఉదయం ఆరుగంటలప్పుడు నేను డ్యూటీకి బయల్దేరుతుంటే నాయుడు ఇంట్లోకి వెళ్తూ కనిపించాడు. తర్వాత 11 గంటలకు ఇంటికి వచ్చే సరికి కుటుంబం అంతా చనిపోయారన్నారు. ఈ ఘోరాన్ని నమ్మలేకపోతున్నాను. ఎదురుగా ఉంటున్నా వారి పరిస్థితి తెలిసేది కాదు. అంత గుట్టుగా ఉండే ఆ దంపతులకు ఏమి కష్టం వచ్చిందో?
 - లక్ష్మి, చిన్నమనాయుడి  పొరుగింటి వాసి, శేషయ్యమెట్ట
 
 ఒకటో తేదీకల్లా అద్దె ఇచ్చే వాడు..
 మా ఆయన పనిచేసే చోటే పనిచేస్తున్నాడు కదా అని ఇల్లు అద్దెకు ఇచ్చాం. మేం కొంచెం దూరంలోని వేరే ఇంట్లో ఉంటాం. అద్దె రూ.1700 ఏ నెలకు ఆనెల ఒకటోతేదీకల్లా ఇచ్చేసేవాడు.  ఆ దంపతులు బయట వాళ్లతో చాలా రిజర్వుడుగా ఉంటారు. రోజూ పిల్లలకు అన్నీ కొనిపెడతాడు. గొడవలు కూడా లేవు. కానీ ఇలా ఎందుకు చేశారో ఆర్థం కావడంలేదు.
 - సత్యవతి, చిన్నమనాయుడి ఇంటి యజమానురాలు
 

మరిన్ని వార్తలు