మూగశిక్ష

2 Feb, 2019 11:49 IST|Sakshi
బక్కచిక్కి మేత కోసం ఎదురుచూస్తున్న ఆవులు

చేయని నేరానికి మూగజీవాలకు శిక్ష

నెల రోజులుగా తిండిలేక   కొన ఊపిరితో పశువులు

చోద్యం చూస్తున్న ఊరి జనం

హత్యాఘటన అనంతర పరిణామాలు

గోసంరక్షణ చేసే వారెవరో?

చేయని నేరానికి  ‘మూగ’జీవాలు శిక్ష అనుభవిస్తూ, తిండిలేక కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వైనమిది. నెల రోజులుగా మూగజీవాలు మేత, నీళ్లు లేక కృశిస్తూ ప్రాణాలు పోయే స్థితికి చేరుకుంటున్నాయి. తల్లి పాలు లేకున్నా తన పాలిచ్చి వారికి ప్రాణదానం చేసే గోవులు ఇప్పుడు తమకు మేత భిక్ష పెట్టేవారి కోసం చావు చూపులతో దీనంగా చూస్తున్నాయి. ఒక మహిళ హత్య ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల పెను విషాదమిది. ఇంతకూ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లో వెళ్దాం రండి.

చిత్తూరు, పుత్తూరు రూరల్‌ : మండలంలోని వేపగుంట క్రాస్, ఎన్టీఆర్‌ కాలనీలో గత నెల 3న దేవకి అనే మహిళ హత్యకు గురవడం విదితమే. పశువుల కొట్టం స్థలంపై ఉన్న వివాదమే హత్యకు దారి తీసింది. గ్రామానికి చెందిన నిందితులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. తదనంతరం హతురాలి కుటుంబ సభ్యులు నిందితుల నివాసం వద్దకు వెళ్లి  ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో వారు భీతిల్లారు. తమకేమైనా ముప్పు తప్పదేమోననే భయంతో వారు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మకాం మార్చారు. అయితే వారు పెంచుకుంటున్న సుమారు 40 ఆవులు, లేగ దూడలను అక్కడే వదిలి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి వాటి ఆలనాపాలనా పట్టించుకునే దిక్కు లేక, వాటికి మేత పెట్టేవారు లేకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికి పది రోజులు దాటింది. హత్యతోను, తగాదాలతోను ఏ సంబంధం లేకపోయినా మేత కరువై మూగ శిక్ష అనుభవిస్తున్నాయి.

పుష్ఠిగా ఉన్న కొన్ని పశువులకు డొక్కలెగరేస్తున్నాయి. చర్మానికి అంటుకుపోయినట్లు ఎముకలు కనిపిస్తున్నాయి.  ఎవరైనా అటు వెళ్లితే..దీనంగా చూస్తూ అంబా..అంబా! అని మేత కోసం అంగలార్చుతున్నాయి. మనసున్న మారాజులు రాకపోతారా? తమకింత గడ్డి పెట్టి ప్రాణాలు రక్షించపోతారా? అని దిక్కులు చూస్తున్నాయి. లేగదూడలైతే నిలబడే శక్తి లేక చతికిలపడిన స్థితిలో ఉండటం చూస్తుంటే మనసు ద్రవించకమానదు.   వాటి దీనావస్థను చూసిన సమీపంలోని కొందరు అప్పుడప్పుడూ కొంత మేత వేస్తున్నా అవి వాటికేమాత్రం సరిపోవడం లేదు. బహుశా అడపా దడపా వేసే కొద్దిపాటి మేత వలనే కళ్లల్లో ప్రాణం పెట్టుకుని మనగలుగుతున్నాయోమే అనిపించకమానదు. పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ మూగజీవాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు