గుండూరావు చేసిన తప్పేంటి?

8 Mar, 2016 23:58 IST|Sakshi
గుండూరావు చేసిన తప్పేంటి?

మావోయిస్టులకు కుటుంబ సభ్యుల సూటి ప్రశ్న
 
గూడెంకొత్తవీధి: ముక్కలి గుండూరావును మావోయిస్టులు ఎందుకు హతమార్చారో తమకు స్పష్టం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల శ్రేయస్సు కోసమే ఉద్యమాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మావోయిస్టులు అన్యాయంగా గిరిజనులను చంపడం ఎంతవరకు న్యాయమని మృతుడి  భార్య చంద్రకళ, సోదరి బేబి ప్రశ్నించారు. జీకేవీధి గ్రామానికి చెందిన సత్యనారాయణ (గుండూరావు)ను ఆదివారం రాత్రి కుంకంపూడి వద్ద మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు మారుమూల గ్రామాల్లో తిరుగుతూ వ్యాపార లావాదేవీలు కొనసాగించిన గుండూరావుకు మావోయిస్టుల నుంచి ఎటువంటి ముప్పు కలగలేదని, అనుకోకుండా పోలీస్ ఇన్‌ఫార్మర్ ముద్రవేసి చంపడం అన్యాయమన్నారు.

ఆయన నిజంగా ఇన్‌ఫార్మర్ అయితే ఆయన కారణంగా మావోయిస్టులు ఎలా నష్టపోయారో వెల్లడించాలని కోరారు. చెప్పుడు మాటలు విని చంపడం, తరువాత ఇన్‌ఫార్మర్‌గా చిత్రీకరించడం తగదన్నారు. మావోయిస్టులు ఎన్ని సార్లు హెచ్చరించినా భయపడకుండా సమాధానం చెప్పుకుని ఇక్కడే జీవించారే తప్ప ఎక్కడికీ వెళ్లిపోలేదని, ఏ తప్పు చేయలేదు కాబట్టే భయపడకుండా ఇక్కడ ఉన్నారని స్పష్టంచేశారు.    ఏజెన్సీలో వ్యాపారం చేసేవారంతా ఏదో ఒక సందర్భంలో పోలీసులతో మాట్లాడుతారని, అంత మాత్రాన వారందరిపైనా ఇన్‌ఫార్మర్ల ముద్రవేసి చంపేస్తారా అని వారు ప్రశ్నించారు. ఏ పాపం చేయని గుండూరావును అన్యాయంగా చంపారని ఆవేదన వ్యక్తంచేశారు.
 
 

>
మరిన్ని వార్తలు