తాతయ్య వెళ్లొస్తాం అన్నారు .. కానీ అంతలోనే

18 Sep, 2019 12:34 IST|Sakshi

సాక్షి, బొమ్మలసత్రం(కర్నూల్‌) : ‘తాతయ్యా.. బాగున్నావా.. అమ్మనాన్నలతో కలిసి ఆదివారం టూర్‌కు వెళ్తున్నాం.. టూర్‌ ఫొటోలు మీకు వాట్సాప్‌లో పంపిస్తా.. నానమ్మకు మా ఫొటోలు చూపించు.. వెళ్లొస్తాం తాతయ్యా’.. అంటూ  హర్షిక ముద్దులొలికే మాటలతో చివరిసారిగా నంద్యాలలో ఉంటున్న తాతయ్యతో మాట్లాడిన మాటలు. గోదావరిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో నంద్యాలకు చెందిన మహేశ్వరరెడ్డి ఆయన భార్య స్వాతిరెడ్డి, పిల్లలు హర్షిక, విఖ్యాత్‌లు గల్లంతయ్యారు. వారిలో స్వాతిరెడ్డి (32), హర్షిక (4) మృతదేహాలను అధికారులు బయటికి తీసి పంచనామా నిర్వహించారు. మహేశ్వరరెడ్డి, విఖ్యాత్‌ల ఆచూకీ ఇంకా లభించలేదు.   

కుటుంబ సభ్యుల్లో ఆందోళన.. 
తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు గల్లంతయ్యారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటంతో పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్‌లో ఉన్న వారి నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణానికి చెందిన సీనియర్‌ న్యాయవాది రామకృష్ణారెడ్డి కుమారుడు మహేశ్వరరెడ్డి ఆయన భార్య స్వాతిరెడ్డి, పిల్లలు హర్షిత, విఖ్యాత్‌లు గల్లంతవటంపై వారి బంధువుల్లో ఆందోళన మొదలైంది. ఆదివారం విశాఖపట్నం నుంచి పాపికొండలు చూసేందుకు కుటుంబసమేతంగా బయలు దేరుతున్నట్లు శుక్రవారమే తండ్రి రామకృష్ణారెడ్డికి ఫోన్‌ చేసి చెప్పాడు. ఏపీ 31బీఎక్స్‌ 4444 నెంబరు మారుతి ఎర్టిగా వాహనంలో పిల్లలతో కలిసి మహేశ్వరరెడ్డి రాజమండ్రి చేరుకున్నాడు.

అక్కడి నుంచి ఆదివారం ఉదయం రాజమండ్రి చేరుకుని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వారు ఏర్పాటు చేసిన బస్సులో దేవిపట్నం మండలం గుండపోచమ్మ గుడివద్ద ఉన్న లాంచీలరేవుకు చేరుకున్నారు. అక్కడి నుంచి వశిష్ట పున్నమి రాయల్‌ బోటులో ప్రయాణించటం కోసం టికెట్‌లు తీసుకున్నారు. 64 మంది ప్రయాణికులతో బోటు విహారయాత్రకు బయలుదేరింది. బోటు కచ్చులూరు వద్దకు చేరుకోగానే గోదావరిలో వరద ఉధృతికి మునిగిపోయింది. ఈప్రమాదంలో మహేశ్వరరెడ్డి కుటుంబసభ్యులు గల్లంతయ్యారు. వారిలో స్వాతిరెడ్డి, హర్షిక మృతదేహాలు లభ్యమయ్యాయి. మహేశ్వరరెడ్డి, విఖ్యాత్‌ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

దేవిపట్నంలో కుటుంబ సభ్యులు.. 
పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. కుమారుడు మహేశ్వరరెడ్డి చెన్నైలో ఎంబీఏ పూర్తి చేశాడు. భూపాల్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావటంతో నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన స్వాతిరెడ్డిని తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి విఖ్యాత్, హర్షిక సంతానం.  

కుమారుడు, మనవడి  కోసం.. 
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన దేవిపట్నం బయలు దేరారు. ఒక్కగానొక్క కుమారుని కుటుంబ సభ్యులు ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకుంటూ ఆతృతతో అక్కడికి చేరుకున్నాడు. అయితే అక్కడ స్వాతిరెడ్డి, హర్షికల మృతదేహాలు చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. శుక్రవారం ఫోన్‌లో మాట్లాడిన మనువడు, మనుమరాలు గుర్తుకు వచ్చి రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. కుమారుడు, మనుమడిల ఆచూకీ లభించక పోవటంపై ఆందోళన చెందుతున్నారు.   

మరిన్ని వార్తలు