పోషణ భారమై కుటుంబం ఆత్మహత్య

16 Sep, 2017 04:06 IST|Sakshi
పోషణ భారమై కుటుంబం ఆత్మహత్య
- మైలవరం జలాశయంలో దూకి బలవన్మరణం
వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో ఘటన
 
మైలవరం: కుటుంబ యజమాని అరకొర సంపాదనతో ఇల్లు గడవక, పోషణ భారమై జీవితం మీద విరక్తి చెందిన ఓ కుటుంబం జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హృదయ విదారకమైన ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులోని గూడెం చెరువులో శుక్రవారం చోటుచేసుకుంది. షేక్‌ వాహిద్‌ (45) తన ఇద్దరు భార్యలు షమీమ్‌ బేగం (41), ఆశా బేగం (39), కుమార్తెలు మహబూబ్‌ బీ (19), షబాన (17)లతో కలిసి స్థానిక రాజీవ్‌ నగర్‌ కాలనీలో నివసిస్తున్నాడు. వాహిద్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. వ్యక్తిగత భద్రత రీత్యా ఆ వృత్తిని మానేసిన వాహిద్‌ చిన్నాచితక పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదాయం తగ్గి ఖర్చులు పెరగడంతో అతనిలో ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఇద్దరు భార్యలు అనారోగ్యం బారిన పడటంతో వారికి వైద్యానికి ఖర్చయ్యేది.  ఈ పరిణామాలతో జీవితంమీద విరక్తి చెందిన ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం ఉదయం ఎల్లార్తిదర్గాకు వెళ్తున్నామని చుట్టుపక్కల వారికి చెప్పిన వాహిద్‌ కుటుంబ సభ్యులు మైలవరం చేరుకున్నారు. అక్కడే ఉన్న అతిథిగృహం ఆవరణ సమీపంలో గట్టుపై చెప్పులు, ఆధార్‌కార్డులు వదిలేసి మూకుమ్మడిగా జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

మధ్యాహ్నం  మూడు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి∙గజ ఈతగాళ్ల సాయంతో మిగతా రెండు మృతదేహాలను వెలికి తీయించారు. వాటిని పోస్ట్‌మార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు , కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వార్తలు