ప్రముఖ ఇంజనీర్‌ ఆచార్య శివాజీరావు కన్నుమూత

1 Apr, 2018 02:10 IST|Sakshi

ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): ఏయూ మాజీ ఆచార్యుడు, ప్రముఖ ఇంజనీర్‌ తిపిరినేని శివాజీరావు శనివారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సందర్శ నార్థం ఆయన భౌతికకాయాన్ని విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టార్‌ 6లోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు ప్రముఖులతో పాటు ఏయూ ఆచార్యులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శనివారం సాయంత్రం జ్ఞానాపురం శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఆచార్య టి. శివాజీరావు 1932లో కృష్ణాజిల్లా ముదినేపల్లిలో జన్మించారు. బెంగళూర్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. టెక్సాస్‌లోని రైస్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు.

అనంతరం రెండేళ్ల పాటు నాగార్జున సాగర్‌ డ్యామ్‌ నిర్మాణానికి ఫీల్డ్‌ ఇంజనీర్‌గా సేవలందించారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. ఆచార్యుడిగా, సివిల్‌ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతిగా, ఏయూ ఇంజ నీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా సేవలందించి పదవీ విరమణ పొందారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును సైతం అందుకున్నారు. అనంతరం పలు ఎన్విరాన్‌మెంటల్, ఇండస్ట్రియల్, హైడ్రోపవర్‌ ప్రాజెక్టులకు టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌గా సేవలందించారు. ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడిగా, బోర్డు టెక్నికల్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. తాజ్‌మహల్, పోలవరంతో పాటు అనేక పర్యావరణ సంబంధిత అంశాలకు సంబంధించి 85కు పైగా ఆయన రచనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమయ్యాయి. ఆయన అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ ప్రాజెక్టులకు ముఖ్య సలహాదారుగా కూడా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు