దాపరికానికి మూల్యం నిండు ప్రాణం

11 Jul, 2020 10:05 IST|Sakshi
వ్యాపారి మృతదేహాన్ని అమలాపురం శ్మశాన వాటికలో ఖననం చేస్తున్న మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది

కరోనా లక్షణాలతో బాధపడుతున్నా అలక్ష్యం

క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తుందన్న భయం

చివరకు వైద్యం అందకుండానే మరణం

ఫ్యాన్సీ వ్యాపారి దయనీయగాథ

సాక్షి, అమలాపురం టౌన్‌: దాపరికంతో చేసిన నిర్లక్ష్యమే అతని నిండు ప్రాణాన్ని బలిగొంది. కరోనా లక్షణాలు ఉన్నా బయటకు చెప్పకపోవడం, వైద్యం చేయించుకునేందుకు భయం, ఆందోళన.. వెరసి మృత్యువు మింగేసింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దేవాంగ వీధికి చెందిన 58 ఏళ్ల ఫ్యాన్సీ వ్యాపారి కరోనాతో గురువారం మృత్యువాత పడ్డాడు. కరోనా లక్షణాలు కనిపించిన ప్రాథమిక దశలోనే అతడు వైద్య పరీక్ష చేయించుకుని సకాలంలో చికిత్స పొంది ఉంటే ప్రాణాలు నిలిచేవి. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో అవస్థ పడుతున్నా ఒకవేళ కరోనా వస్తే తాను వెంటిలేటర్‌ వైద్యంలోకి, కుటుంబీకులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో అతడు విషయాన్ని బయటకు చెప్పలేదు. దాదాపు పది రోజులు ఇంట్లోనే ఉండిపోయాడు. చివరకు ఇంట్లోనే దగ్గుతూ, జ్వరంతో మూలుగుతూ, శ్వాస కోశ సమస్యతో సతమతమవుతూ చివరకు ప్రాణాలు విడిచాడు.

భార్య మాట విని ఉంటే..
ఫ్యాన్సీ వ్యాపారి పది రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. ఇది గమనించిన అతని భార్య మొదటి నుంచీ పోరు పెడుతోంది. ఏదైనా ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోమని ఒత్తిడి తెచ్చింది. చివరకు రెండు, మూడు ప్రైవేటు ఆస్పత్రులకు వైద్యం కోసం వెళ్లినా అక్కడ కరోనా పరిణామాలతో వైద్యం చేయలేమని నిరాకరించారు. చివరకు భార్య చొరవ తీసుకుని వార్డు వలంటీర్‌కు సమాచారం ఇచ్చింది. వైద్య సిబ్బంది వచ్చి అతడిని పరీక్షించి అవి కరోనా లక్షణాలేనని అనుమానం వ్యక్తం చేశారు. ఐదు రోజుల క్రితం భార్యాభర్తలను వేర్వేరు ఆటోల్లో ప్రభుత్వ ఆస్పత్రికి రమ్మని వైద్య సిబ్బంది చెప్పారు. అక్కడ అతడికి కరోనా పరీక్ష చేశారు. రిపోర్టు వచ్చిన తర్వాత చెబుతామని తిరిగి పంపించి వేశారు. ఈలోగా అతడికి రోగ లక్షణాలు మరింత తీవ్రతరమయ్యాయి. వైద్య సిబ్బందిని సంప్రదిస్తే టెస్ట్‌ రిపోర్ట్‌ వచ్చాక వైద్యం మొదలుపెడతామన్నారు.

గురువారం ఉదయం అతడికి దగ్గు, ఊపిరి సమస్య, జ్వరం పెరగడంతో పాటు విరేచనాలు కూడా అధికమయ్యాయి. రోగి భార్య, చెల్లెలు కలిసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. ఈలోగా అతని పరిస్థితి మరీ విషమంగా ఉండడంతో ఇంట్లోంచి రోడ్డు మీదకు  తీసుకువచ్చారు. ఆటోలో ప్రభుత్వ ఆస్పతికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించి మళ్లీ కరోనా టెస్ట్‌ చేశారు. ఆ రిపోర్టులో పాజిటివ్‌ రావడంతో శుక్రవారం ఉదయం మృతదేహానికి మున్సిపాలిటీయే అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది. మృతుడి ఇల్లు ఉన్న దేవాంగుల వీధినికంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు