ఫోని గండం

28 Apr, 2019 12:02 IST|Sakshi

నెల్లూరు(పొగతోట): జిల్లాకు ఫోని తుపాను గండం పొంచి ఉంది. గంట గంటకు  తుపాన్‌ తరుముకొస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. మండు వేసవి సమయంలో చలి, ఈదురుగాలులు వీయడంతో ప్రజలు భయంతో వణుకుతున్నారు. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. తీర ప్రాంతం కోతకు గురవుతోంది. తుపాను ప్రభావంతో ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని అనుకుని ముందుకు కదులుతున్న వాయుగుండం తుపాన్‌గా మారింది.

మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. మంగళవారం తమిళనాడు ఉత్తర, ఆంధ్ర దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చెన్నైకు ఆగ్నేయ దిశగా 1,120 కిలో మీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 1,450 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. అది దిశ మార్చుకుంటూ గంటకు 47 కిలో మీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో 162 కిలో మీటర్ల సముద్రతీరం ఉంది. సముద్ర తీరం వెంబడి వందల గ్రామాలు ఉన్నాయి. లోతట్టు, తీర ప్రాంతాల తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులతో కలెక్టర్‌ ఆర్‌. ముత్యాలరాజు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను భవనాలను సిద్ధం చేయాలన్నారు. భారీ వర్షాలు పడితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

15 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం
వాకాడు: వాకాడు తీరంలో చలి, ఈదురు గాలులు వీయడంతో పాటు సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. గంట గంటకూ సముద్రం ముందుకు చొచ్చుకుని వచ్చి దాదాపు 15 మీటర్ల తీరం కోతకు గురవుతోంది. శనివారం వరకు సముద్రం పైభాగం కాస్త నిలకడగా ఉండి లోలోపలి భాగంలో సుడులు తిప్పుతున్న సాగరం ఒక్కసారిగా ఆదివారం సాయంత్రం నుంచి అల్లకల్లోలంగా మారింది. మండలంలోని కొండూరుపాళెం, తూపిలిపాళెం సముద్ర తీరాలను ఆదివారం గూడూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు.  తీర ప్రాంతంలోని మత్స్యకారులు తమ వేట సామగ్రిని ఒడ్డుకు చేర్చి భద్ర పరుస్తున్నారు.

మరిన్ని వార్తలు