ముత్తంశెట్టిని ముంచెత్తిన అభిమానం

17 Feb, 2019 08:40 IST|Sakshi
ఎయిర్‌పోర్టులో ముత్తంశెట్టికి స్వాగతం పలుకుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు

విమానాశ్రయంలో ఘన స్వాగతం

సింహాచలం వరకు భారీ ర్యాలీ

వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు

జై ముత్తంశెట్టి, జైజగన్‌ అంటూ నినాదాలు

సాక్షి,విశాఖపట్నం/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో శనివారం అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు అఖండ స్వాగతం లభించింది. వేలాది అభిమానులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులు అభిమానంతో ముంచెత్తారు. పూలజల్లులు కురిపిం చారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు తాజాగా ఎంపీ పదవికి రాజీనామా ప్రకటించి వైఎస్సార్‌ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆయనను వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యన్నారాయణ, నియోజకవర్గ సమన్వయకర్తలు అమర్‌నా«థ్, డాక్టర్‌ రమణమూర్తి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, వంశీకృష్ణ శ్రీనివాస్, కె.కె రాజు, తిప్పల నాగిరెడ్డి, పార్టీ నాయకులు కోలా గురువులు, చొక్కాకుల వెంకటరావు, కొయ్య ప్రసాద్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ జియ్యాని శ్రీధర్, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి తదితర నాయకులు స్వాగతం పలికారు. సుమారు 200 కార్లు, వెయ్యికు పైగా బైక్‌లతో ర్యాలీగా సింహాచలం చేరుకున్నారు. కొండదిగువ తొలిపావంచా వద్దనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా భీమిలి చేరుకున్నారు.

ముత్తంశెట్టిని జనాలు కోరుకుంటున్నారు..
ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యన్నారాయణ మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గ ప్రజలు గతంలో ముత్తంశెట్టిని ఎమ్మెల్యేగా చూశారు. మళ్లీ ఆయననే కోరుకుంటున్నారన్నారు. పదేళ్ల రాజకీయ జీవితంలో ఆయనకు అవినీతి మరక లేదు.. మంచి ఆలోచనలు ఉండడం వల్ల దొంగల పార్టీలో ఉండలేక వైఎస్సార్‌ సీపీలోకి వచ్చేశారని తెలిపారు. పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలిలో గెలవడానికి కారణం ముత్తంశెట్టి శ్రీనివాసరావు దయ అన్నారు. భీమిలి ఎమ్మెల్యేగా మంచి పేరు సంపాదించుకున్న ముత్తంశెట్టి ఆనాడు గంటాకు మద్దతివ్వడం వల్లే ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. టీడీపీలో గౌరవం లేక అవమానం, ఆవేదన భరించలేక.. వైఎస్సార్‌ సీపీలో స్వతంత్రంగా ఉండొచ్చని పార్టీలో చేరారన్నారు. అనకాపల్లి సమన్వయకర్త అమర్‌నాథ్‌ మాట్లాడుతూ ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాకతో వైఎస్సార్‌ సీపీ బలోపేతం అవుతుందన్నారు. గంజాయివనంలో తులసి మొక్కలా టీడీపీలో ఉండలేక వైఎస్సార్‌ సీపీలో చేరారన్నారు. ముత్తంశెట్టి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటారన్నారు. అందువల్లే గతంలో చంద్రబాబు వద్దన్నా రైల్వే జోన్‌ కోసం ఉద్యమాలు చేశారని తెలిపారు.

విలువల కోసం పార్టీ మారాను
విలువలు, విశ్వసనీయత గురించి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విశాఖ ఎయిర్‌పోర్టులో ముత్తంశెట్టి శ్రీనివాస్‌ మీడియాతో అన్నారు. కేవలం విలువల కోసం పార్టీ మారిన నన్ను విమర్శించే స్థాయి, అర్హత మంత్రి గంటాకు లేదని ధ్వజమెత్తారు. నమ్మిన నాయకులను, నమ్మిన పార్టీలను నట్టేటముంచి రాజకీయ ప్రాపకం కోసం పాకులాడే గంటాకు నన్ను విమర్శించే స్థాయి లేదన్నారు. ‘గత ఎన్నికలకు ముందు తనకు భీమిలి టికెట్‌ ఇప్పిస్తానని చెప్పి టీడీపీలోకి తీసుకెళ్లి చివరికి అనకాపల్లి ఎంపీగా పోటీచేయించి..ఆ టికెట్‌ కాజేసిన నీచ రాజకీయం నీది.. అలాంటి నువ్వు ఎథిక్స్‌ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా’ ఉందన్నారు.

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తా..
సింహాచలం(పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి తొలిసారిగా శనివారం నగరానికి చేరుకున్న ఆయన నేరుగా సింహాచలానికి వచ్చారు. కొండదిగువ తొలిపావంచా వద్దనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టారు. స్వామికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మీడియాతో మాట్లాడుతూ నాకెంతో ఇష్టమైన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక్కడ నుంచే భీమిలి నియోజకవర్గంలోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రజలు, అభిమానులు స్వాగతం పలకడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

మరిన్ని వార్తలు