పంథా మార్చి దందా !

12 Jul, 2014 00:07 IST|Sakshi
పంథా మార్చి దందా !

సాక్షి, గుంటూరు : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్క దారి పడుతోంది. బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపడంతో రేషన్ మాఫీ యా రూటు మార్చి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కింది స్థాయి సిబ్బంది నిర్వాకంతో పౌరసరఫరాల విభాగం అభాసుపాలవుతోంది.
 
 జిల్లాలో 200కు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని ఈ మిల్లులకు తరలించి సంచులు మార్చి రీసైక్లింగ్ చేసి, రైతుల నుంచి ధాన్యం సేకరించకుండా వీటినే లెవీగా ఇచ్చేవారు. పాటు వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తుండటంతో మాఫియా రూటు మార్చింది.
  చిలకలూరిపేట, నరసరావుపేట, నకరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచర్ల, వినుకొండ, బాపట్ల, గుంటూరు నగరంలో అక్రమ రవాణా ఎక్కువగా ఉంది.
 
 జిల్లాలో బియ్యం తరలింపునకు 10 నుంచి 15 మాఫియా బృందాలు  ప్రత్యేకంగా పనిచేస్తునట్లు సమాచారం.
 
 విజిలెన్స్ అధికారులు 2013 ఏప్రిల్ నుంచి నమోదు చేసిన కేసులు
 
 అక్రమ రవాణాలోనూ కొత్తపుంతలు
 బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించడంతో మాఫియా సైతం కొత్త మార్గాలు అనుసరిస్తోంది.

 నల్లగొండ జిల్లా అయితే హాలియా, మిర్యాలగూడకు, నెల్లూరు జిల్లా వైపు అయితే కావలికి, పశ్చిమగోదావరి వైపు అయితే జంగారెడ్డిగూడెం ,తూర్పుగోదావరి జిల్లా వైపు అయితే మండపేట మీదుగా కాకినాడ పోర్టుకు చేర్చుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకోసం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
 
 ప్రతి మండలం నుంచి ఒక తేదీ నిర్ణయించి ఆటోల ద్వారా ప్లాస్టిక్ సంచు ల్లోకి మార్చిన బియ్యాన్ని ఒక ప్రదేశానికి చేర్చుతారు. వాటిని ఎక్కడకు తరలించేదీ ఆటో డ్రైవర్‌కు కూడా ముందుగా తెలియనివ్వరు.
 
 అలా చుట్టు పక్కల నుంచి 300 బస్తాల బియ్యాన్ని చేర్చి, సమీప ప్రాంతాల్లో అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న లారీని అక్కడకు రప్పించి గంటలోపే లోడ్ చేసి హైవే మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తారు.
 
 అధికారుల కళ్లుగప్పేందుకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా ఒక మిల్లు నుంచి ఇంకొక మిల్లుకు బియ్యం తరలిస్తున్నట్లు వే బిల్లులు సృష్టిస్తున్నారు.
 
 లారీకి ముందుగా ఒక పెలైట్ వాహనాన్ని ఏర్పాటు చేసి వారితో లారీ డ్రైవర్‌కు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందిస్తూ ఉంటారు.
 
 అధికారుల హడావుడి, ఆకస్మిక తనిఖీలు వంటివి ఏవైనా ఉంటే సమాచారం ఇచ్చి వాహనాన్ని పక్కన నిలిపి వేస్తారు. హడావుడి తగ్గాక చక్కగా జిల్లా సరిహద్దులు దాటించేస్తారు.
 అన్ని జిల్లాల్లోనూ ఈ తరహా మాఫియాలు సిండికేట్‌గా ఏర్పడి సమాచారం బయటకు రానివ్వడం లేదని తెలుస్తోంది.
 
 అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తే ఇలాంటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది.
 

>
మరిన్ని వార్తలు