వ్యవసాయ కూలీల ఆటో బోల్తా

28 Feb, 2015 04:02 IST|Sakshi

 దగ్గుబాడు (కారంచేడు) : వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో రోడ్డు పక్కన పంట కాలువలో బోల్తా కొట్టడంతో 12 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పోతినివారిపాలెం-దగ్గుబాడు గ్రామాల మధ్య శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన సుమారు 30 మంది వ్యవసాయ కూలీలు ఆదే గ్రామానికి చెందిన దాసరి నరసింహారావు టాటా ఏస్ ఆటోలో కూలి పనుల కోసం దగ్గుబాడు వైపు వెళ్తున్నారు.

పోతినివారిపాలెం-దగ్గుబాడు గ్రామాల మధ్య వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో ఆటోకు కూలీలు ప్రయాణిస్తున్న టాటా ఏస్ ఆటో సైడ్ ఇవ్వబోయి మార్జిన్‌లో దిగి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు తిరుమలశెట్టి నర్సమ్మ, నీరుకట్టు సుందరరావమ్మ, లక్కాకుల సుబ్బులు, గొనసపూడి రాముడు, ఇళ్ల అరుణ, తిరుమలశెట్టి పుష్పావతి, రమాసుందరి, భూపతి సామ్రాజ్యం, బండి సోని, చింతపల్లి వరలక్ష్మి, గలబ కోటేశ్వరమ్మలకు గాయాలయ్యాయి.  
    
దగ్గుబాడు సర్పంచ్ ముల్లా నూర్‌అహ్మద్, పోతినివారిపాలెం సర్పంచ్ ధర్మా 108 సిబ్బందికి సమాచారం అందించారు. పర్చూరు, చీరాలకు చెందిన 108 వాహనాల్లో క్షతగాత్రులను చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి తల, నడుము, చేతులు, కాళ్లు, ఛాతీ భాగాల్లో పైకి కనిపించని దెబ్బలు తగిలాయని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు నీరుకట్టు వాసుబాబు, సర్పంచ్ కట్టా లక్ష్మణబాబు పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు