సాగే నాగై కాటేసింది..

28 Mar, 2015 03:03 IST|Sakshi

చింతలగూడెం (నెల్లిపాక): మట్టిని నమ్ముకోవడమే ఆయన పాపమైంది. ఫలితంగా తన ఊపిరిని తానే గాలిలో కలుపుకొన్నారు. ఏ పంట వేసినా, ఎంత చెమటోడ్చినా సాగు నాగుబాముతో చెలగాటమైంది. పేరుకున్న అప్పులు పాముకాట్లలా బాధిస్తుంటే.. విషమే ఆ బాధకు విరుగుడైంది. నెల్లిపాక మండలం కన్నాయిగూడెం పంచాయతీ పరిధిలోని చింతలగూడెం గ్రామానికి చెందిన లంకపల్లి నర్శింహారావు(40) అనే రైతు గురువారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నర్శింహారావు తనకున్న ఎకరం సొంత పొలంతో పాటు మరో 3.5 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి, కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. అయితే గత మూడేళ్ల నుంచి ఏ పంట వేసినా గోదావరి వరదలు, తుపానుల తాకిడికి పాడవడం రివాజైంది. అయినా ఆయనకు ప్రభుత్వపరంగా ఒక్క రూపారుు కూడా  పంట నష్ట పరిహారంగా అందలేదు.
 
 అరుునా నర్శింహారావు వ్యవసాయూన్ని విడిచిపెట్టక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. గత ఏడాది నాలుగు ఎకరాల్లో పత్తి పంటను సాగుచేయగా గోదావరికి వచ్చిన వరదలకు  చేను నీటమునిగి కుళ్లిపోయింది. దీంతో పొలంలో పత్తి మొక్కలను తొలగించి మరలా టమాటా, వంగ, దోస పంటలను సాగు చేశారు. అరుుతే ప్రకృతి పగబట్టినట్టు ఏ పంటా ఆశాజనకంగా, ఏపుగా ఎదగలేదు. దీంతో నర్శింహారావు దిగులు పడ్డాడు.
 
 చావే శరణ్యమనుకుని..
 ఇదే సమయంలో చేలలో గ్రామానికి చెందిన కొందరి పశువులు పడి పంటలను పాడు చేశాయి. ఈ విషయంపై గ్రామంలో పెద్దలు పంచాయితీ నిర్వహించినప్పటికీ నర్శింహారావుకు ఎటువంటి ఆర్థిక సహాయం పశువుల యజమాని ఇవ్వలేదు. ఈ పరిణామం నర్శింహారావును మరింత బాధించింది. బ్యాంకులో తీసుకున్న సుమారు రూ.50వేల రుణంతో పాటు ప్రైవేటుగా తెచ్చిన మరో రూ.1.5 లక్షల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక మనో వేదనకు గురయ్యారు. ఇంకోవైపు పెళ్లీడుకు వచ్చిన కుమార్తె సరితకు పెళ్లి చేయూల్సిన బాధ్యతను తలుచుకుని మరింత కుంగిపోయూరు.
 
 వీటన్నింటి నుంచీ విముక్తికి చావే శరణ్యం అనుకున్నారు. రోజూ లాగే కూరగాయల తోట వద్ద కాపు కాసేందుకు గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లారు. చేలో ఉన్న పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారిన తరువాత చేలో విగత జీవిగా పడి ఉన్న నర్శింహారావును చూసిన తోటి రైతులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య యాకమ్మ, కుమార్తె సరిత, పదవ తరగతి చదువుతున్న కుమారుడు సాయికుమార్ ఉన్నారు. ఆయన ఆత్మహత్యతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూనవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నర్శింహారావు పంట నష్టపోయినప్పుడు ఎలాంటి పరిహారం ఇవ్వని ప్రభుత్వం.. ఇప్పుడు ఆయననే పోగొట్టుకున్న కుటుంబాన్నైనా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు