‘అధికార’ దౌర్జన్యం.. ఖాకీ కర్కశం

4 Feb, 2019 13:59 IST|Sakshi
నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతు రఘురాం , రైతు కుటుంబంపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నాయకులు

పేదల భూమి కబ్జాకు అధికార పార్టీ నాయకుల యత్నం

మహానంది ఎస్‌ఐ తులసీ నాగ ప్రసాద్‌ వత్తాసు

బాధితులపైనే విచక్షణారహితంగా దాడి

రైతును రోడ్డుపై పడేసి తన్నిన వైనం

మనస్తాపంతో బాధితుడి ఆత్మహత్యాయత్నం

బొమ్మలసత్రం: తెలుగుదేశం పార్టీ నాయకులు గూండాలను మించిపోయారు. పేదలపై ప్రతాపం చూపుతున్నారు. నిస్సహాయుల భూములను లాగేసుకుంటున్నారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. పైగా బాధితులపైనే దాడులు చేస్తున్నారు. తమ భూమిని కబ్జా చేయబోయిన అధికార పార్టీ నాయకులను అడ్డుకున్న బాధితులపై మహానంది ఎస్‌ఐ తులసీ నాగ ప్రసాద్‌ విచక్షణారహితంగా దాడి చేశారు. రైతులను నడిరోడ్డుపై పడేసి తన్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన రఘురాం అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ఆదివారం మహానందికి సమీపంలోని బుక్కాపురం వద్ద చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  

మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన గడేకారి సాలమ్మ అనే పేద మహిళకు 1973లో అప్పటి ప్రభుత్వం సాగు నిమిత్తం మహానందికి సమీపంలోని సర్వే నంబర్‌ 93/1లో 1.25 ఎకరాల భూమి ఇచ్చింది. పట్టా కూడా మంజూరు చేసింది. ఆమెకు ఇద్దరు మనవళ్లు రఘురాం, జయరాం. ప్రస్తుతం వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే..దీనిపై స్థానిక టీడీపీ నాయకులు పన్నంగి రమణయ్య, సుదర్శన్‌ కన్నేశారు. వీరికి బుక్కాపురం ఎంపీటీసీ సభ్యురాలు వరలక్ష్మి భర్త గుద్దేటి నాగరాజు మద్దతుగా నిలుస్తున్నాడు. ఏవిధంగానైనా భూమిని సొంతం చేసుకోవాలని సాలమ్మ కుటుంబ సభ్యులను కొంతకాలంగా వేధిస్తున్నారు. ఆ భూమిని ఆనుకునే టీడీపీ నాయకుడు పన్నంగి రమణయ్య భూమి కూడా ఉంది. ఇదే అదనుగా 1.25 ఎకరాల్లో తనకు 25 సెంట్లు వస్తుందంటూ రమణయ్య.. సాలమ్మ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా తన పార్టీ నాయకులతో కలిసి మహానంది ఎస్‌ఐ తులసీ నాగ ప్రసాద్‌ వద్దకు వెళ్లారు.

దీంతో ఎస్‌ఐ శనివారం రాత్రి బాధితులను స్టేషన్‌కు పిలిపించారు. టీడీపీ నేతలకు తలొగ్గి బాధితులపైనే ఒత్తిడి పెంచారు. తప్పనిసరిగా భూమిని టీడీపీ నాయకుడికి ఇవ్వాల్సిందేనంటూ బెదిరించారు. ఎటూ పాలుపోని స్థితిలో బాధితులు ఒప్పుకున్నారు. ప్రస్తుతం అరటి వేశామని, వచ్చే వేసవిలో పంటను కోసేసిన తరువాత 25 సెంట్ల భూమిని అప్పగిస్తామంటూ గడువు అడిగారు. అయితే.. ఆదివారం ఉదయమే టీడీపీ నాయకులు కొందరు గూండాలతో కలిసి పొలం వద్దకు వెళ్లి రాళ్లను పాతించడం మొదలుపెట్టారు. రఘురాం భార్య దేవి, జయరాం భార్య లక్ష్మిదేవి వారికి అడ్డు చెప్పినా వినలేదు. పైగా వారిపైనే దాడి చేశారు. అంతటితో ఆగకుండా మహానంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐను కలిశారు. విషయం తెలుసుకున్న రఘురాం, జయరాం పొలం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ తులసీ నాగ ప్రసాద్‌ అసభ్య పదజాలంతో దూషిస్తూ అన్నదమ్ముళ్లను విచక్షణారహితంగా తన్నడం మొదలుపెట్టారు. ఈ ఘటనను స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా గమనించిన ఎస్‌ఐ వారిని కూడా దూషిస్తూ ఆ దృశ్యాలను తొలగింపజేశారు. నలుగురిలో పరువుగా బతికే తనను ఎస్‌ఐ రోడ్డుపై పడేసి తన్నడంతో మనస్తాపానికి గురైన రఘురాం వెంటనే  పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతను మృతి చెందితే సమస్యలు వస్తాయని భావించిన ఎస్‌ఐ.. హుటాహుటిన పోలీసు వాహనంలో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ప్రస్తుతం రఘురాం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. టీడీపీ నాయకుల వేధింపుల నుంచి కాపాడాలని, తమను ఇబ్బందులకు గురి చేసిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.  

ఎస్‌ఐ తీరే వివాదాస్పదం
ఎస్‌ఐ తులసీ నాగ ప్రసాద్‌ తరచూ వివాదాల్లో ఉంటున్నారు. పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య ఘటనలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ.. వారి కనుసన్నల్లో పనిచేస్తుంటారన్న విమర్శలున్నాయి. 

మరిన్ని వార్తలు