పిడుగుపాటుకు రైతు బలి

8 Oct, 2014 02:43 IST|Sakshi

గిద్దలూరు : పిడుగుపాటుకు రైతుతో పాటు అతనికి చెందిన ఎద్దు కూడా మృతిచెందింది. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. వేములపాడుకు చెందిన మోక్షగుండం అంకయ్య (37) తన రెండు ఎద్దులను గ్రామ సమీపంలోని పొలాల్లో మేపుకుంటుండగా వర్షం ప్రారంభమైంది. దీంతో ఎద్దులను తోలుకుని పొలం నుంచి ఇంటికి బయలుదేరాడు. ముందువైపు ఒక ఎద్దు, వెనుకవైపు ఒక ఎద్దు నడుస్తుండగా మధ్యలో అంకయ్య నడుస్తున్నాడు. పొలంలో నుంచి రోడ్డుమీదకు వచ్చిన కొద్దిసేపటికే అంకయ్య కాళ్లవద్ద పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

అతని వెనుక ఉన్న ఎద్దు కూడా పిడుగుపాటుకు మృతిచెందగా, ముందువైపున్న ఎద్దు భయపడి వేగంగా పరిగెడుతూ గ్రామానికి చేరుకుంది. పిడుగుపడిన ప్రదేశంలో తారురోడ్డుపై రంధ్రం ఏర్పడింది. అటుగా వెళ్తున్న వారు గుర్తించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని భోరున విలపించారు. అంకయ్య స్వగ్రామం బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం కాగా, అతని అక్క అంకమ్మను వేములపాడుకు చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారు. అంకమ్మ కుమార్తె లింగమ్మను వివాహం చేసుకున్న అంకయ్య.. 12 సంవత్సరాలుగా వేములపాడులోనే నివాసముంటూ వ్యవసాయం చేస్తున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని చూసి వారంతా కన్నీరుమున్నీరయ్యారు. అంకయ్యతో పాటు మృతిచెందిన ఎద్దు విలువ రూ.50 వేలు ఉంటుంది. గ్రామ వీఆర్వో శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గిద్దలూరులోనూ పిడుగు...
గిద్దలూరు పట్టణంలోని పాండురంగారెడ్డినగర్‌లో ఉన్న బాలరంగారెడ్డి ఇంటిపై కూడా మంగళవారం పిడుగుపడింది. దీంతో మిద్దెపై ఉన్న గోడ దెబ్బతింది. పైఅంతస్తులో అద్దెకు ఉంటున్న చిన్నారెడ్డి గృహంలోని టీవీ, విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయి.

మరిన్ని వార్తలు