పింఛన్ పోయింది.. గుండె ఆగింది!

14 Nov, 2014 04:54 IST|Sakshi

కొత్తూరు: సెంటు భూమి కూడా లేని అతనికి పింఛన్ సర్వే కమిటీ సభ్యులు ఏకంగా ఐదు ఎకరాలు ఉన్నట్టు రికార్డుల్లో నమోదు చేశారు. ఫలితంగా సుమారు పదేళ్లుగా తీసుకుంటున్న వృద్ధాప్య పింఛన్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన గుండె ఆగిపోయింది.. కుటుంబ సభ్యులను ఆవేదనకు గురి చేసింది. ఈ విషాద ఘటన కొత్తూరు మండలంలోని సిర్సువాడలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నక్క ఎండు (68)కు సెంటు భూమి కూడా లేదు.

ఇతను సుమారు పదేళ్లుగా వృద్ధాప్య పింఛన్‌ను అందుకుంటున్నాడు. ఇటీవల టీడీపీ సర్కార్ పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచడంతో అతనితోపాటు కుటుంబ సభ్యులు కూడా సంబరపడిపోయూడు. అయితే ఇటీవల ప్రభుత్వం పింఛన్ల సర్వేను చేపట్టింది. ఈ క్రమంలో సెంటు భూమి కూడా లేని ఎండు పేరున ఐదు ఎకరాలు ఉన్నట్టు సర్వే బృందాలు రికార్డుల్లో నమోదు చేయడంతో అతని పింఛన్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న అతను అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి పింఛన్‌ను పునరుద్ధరించాలని వేడుకున్నాడు.

అయినా ఎవరూ కనికరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎండు మంచం పట్టి గురువారం మృతి చెందినట్టు అతని భార్య దాలమ్మ రోదిస్తూ చెప్పింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎస్‌ఆర్‌డీహెచ్ కమిటీ పేరుతో నిరు పేదలమైన తమలాంటి వారి పింఛన్ రద్దు చేయడం దారుణమని వాపోయింది. సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడని, పాలకులే ఆదుకోవాలని డిమాండ్ చేసింది. మృతుడు ఎండుకు భార్త దాలమ్మ, కుమారుడు రాంబాబు, కుమార్తె విజయలక్ష్మిలు ఉన్నారు.

మరిన్ని వార్తలు