ఓ మాజీ సైనికుడి దీనగాథ

31 Jan, 2020 11:34 IST|Sakshi
సాక్ష్యాధారాలను మాజీ సైనికుడు కఠెవరపు వివేకానందరెడ్డికి అందిస్తున్న భీమప్ప భార్య సుశీల, పిల్లలు

25 ఏళ్లపాటు సైన్యంలో పని చేసిన భీమప్ప

కాలు కోల్పోవడంతో తిరిగి స్వగ్రామానికి..   

1.83 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

కబ్జా చేసిన ఆక్రమణదారులు  

పోరాడుతూనే మృతి చెందిన మాజీ సైనికుడు

ఇప్పటికీ ఆయన కుటుంబానికి అందని న్యాయం   

శత్రు దేశాల కుట్రలను ముందుగానే పసిగట్టగలిగాడుగానీ, సొంత ఊరిలో కుతంత్రాలను గుర్తించలేకపోయాడు. ప్రాణాలకు తెగించి శత్రు మూకలతో పోరాడాడుగానీ, ఉన్న ఊరిలో దురాక్రమణదారుల దెబ్బకు నిలువలేకపోయాడు. యుద్ధంలో కాళ్లు పోయినా ప్రభుత్వమిచ్చిన భూమిని నమ్ముకుని కాలం వెళ్లదీద్దామనుకున్నాడు. ఇంతలో రాబందుల్లా వచ్చి వాలిన ఆక్రమణదారులు ఆ భూమిని లాగేసుకోవడంతో పోరాడి అలసి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఆయన కుటుంబమూ ఉన్న ఆధారాన్ని దక్కించుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది.

తాడేపల్లిరూరల్‌: తెనాలి మండలం కొలకలూరుకు చెందిన నంది భీమప్ప 1962లో దేశ రక్షణ కోసం సైనికుడిగా చేరాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన సుశీలతో వివాహమైంది. పెళ్లి అనంతరం 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో, 1971లో బంగ్లాదేశ్‌తో జరిగిన యుద్ధాల్లో పాల్గొన్నాడు. చివరిగా తన కుడికాలు పోగొట్టుకున్నాడు. 1980లో భీమప్పను ఇంటికి పంపించారు. మాజీ సైనికుల కోటా కింద భీమప్పకు తాడేపల్లి మండలం చిర్రావూరులో సర్వే నంబర్‌ 26/1ఏలో 1.83 ఎకరాలు కేటాయించారు. కొంత కాలం పండించుకున్న అనంతరం భీమప్ప అనారోగ్యరీత్యా ఆ పొలాన్ని వేరే వారికి కౌలుకు ఇచ్చాడు. అప్పటి నుంచి భీమప్ప పొలాన్ని కొంత మంది దళారులు ఆక్రమించి దౌర్జన్యానికి దిగారు. 

పదే పదే ఆక్రమణలు
1994లో కోర్టును ఆశ్రయించిన భీమప్ప పొలాన్ని దక్కించుకున్నాడు. తిరిగి మళ్లీ ఆక్రమించుకోవడంతో 1999లోనూ మరోసారి కోర్టుకు వెళ్లాడు. అప్పుడూ న్యాయం భీమప్ప పక్షానే ఉంది. ఈ సమయంలో కొంతమంది దళారులు, ఇరిగేషన్‌ అధికారులు తమకు సదరు స్థలాన్ని కేటాయించారంటూ కొన్ని నకిలీ డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించారు. ఇవి నకిలీవని కోర్టు కొట్టేసింది. అనంతరం పొలాన్ని భీమప్పకు కేటాయించారు. 2003 సంవత్సరం ఏప్రిల్‌ 2న భీమప్ప మృతి చెందాడు. 

కౌలుకు తీసుకున్నారు..  దారిగా మార్చారు
భీమప్ప భార్య సుశీల సదరు భూమిని తాడేపల్లికి చెందిన ఓ మోతుబరి రైతుకు కౌలుకు ఇచ్చింది. రెండు సంవత్సరాలు కౌలు ఇచ్చిన అనంతరం మూడో సంవత్సరం నుంచి డబ్బులు చెల్లించకుండా ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఎవరితో చెప్పుకోలేక అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయింది. అనంతరం కౌలుకు తీసుకున్న రైతు మాజీ సైనికుడి పొలంలో నుంచి తన పంట పొలంలోకి కరకట్ట నుంచి ర్యాంపు వేసి ఆక్రమించుకున్నాడు. మరో పక్క షెడ్డు ఏర్పాటు చేసి అందులో కాపలాదారులను పెట్టి పంట పొలంలోకి సుశీలను రానీయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం సుశీల స్పందన కార్యక్రమంలో పోలీసులను ఆశ్రయించింది. ఇది తెలిసిన సదరు రైతు.. లక్ష రూపాయలు పడేస్తాను, పిటిషన్‌ వెనక్కు తీసుకోవాలని బెదిరించాడు.  ఈ నేపథ్యంలో మంగళగిరిలో మాజీ సైనికుడు కఠెవరపు వివేకానందరెడ్డిని కలిసిన సుశీల తన గోడును వెళ్లబుచ్చుకుంది. దీంతో వివేకానందరెడ్డి సదరు భూమికి సంబంధించిన పత్రాలను సేకరించారు. వీటితో కలెక్టర్‌ను కలిసి మాజీ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించుకోనున్నారు.   

ఎంఆర్‌ఓ వివరణవిచారణ చేసి చర్యలుతీసుకుంటాం
మాజీ సైనికుడు భీమప్ప పొలం ఆక్రమణ విషయం మా దృష్టికి వచ్చింది. రికార్డులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. భీమప్పకు 1.83 సెంట్లు ప్రభుత్వం కేటాయించినట్లు రుజువైతే ఆయన కుటుంబీకులకు స్వాధీనం చేస్తాం.

మరిన్ని వార్తలు