రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం

28 Sep, 2013 06:34 IST|Sakshi

ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: డీసీఎం వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఓ రైతు మృతిచెందాడు. మృతుని కుటుంబీకులు తెలిపిన ప్రకారం రఘునాధపాలెం మండలంలోని వేపకుంట్ల గ్రామానికి చెందిన రైతు అనుబోతు వెంకటేశ్వర్లు(53) కొన్ని రోజులుగా చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఖమ్మం ఆస్పత్రిలో పరీక్ష చేయించుకునేందుకు వీవీ పాలెం మీదుగా ద్విచక్ర వాహనంపై ఆర్‌ఎంపీ రాంబాబుతో కలిసి ఖమ్మం వెళుతున్నాడు. వీరి వాహనాన్ని, గోపాలపురం వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాను ఢీకొంది. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న అనుబోతు వెంకటేశ్వర్లు భుజం భాగం పూర్తిగా తెగిపడి, తీవ్ర రక్తస్రావమైంది. అతను ఆస్పత్రిలో మృతిచెందాడు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆస్పత్రికి వెళ్లొస్తానని ఇంటి నుంచి బయల్దేరిన గంటలోపే వెంకటేశ్వర్లు మృతిచెందాడన్న సమాచారంతో అతని భార్య, కుమారులు దిగ్భ్రాంతులయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉండే అనుబోతు వెంకటేశ్వర్లు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఖమ్మంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని ఖమ్మం మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, వేపకుంట్ల గ్రామ సర్పంచ్ ఆర్.రమేష్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కుర్రా భాస్కర్‌రావు, స్థానికులు చిన్నబోయిన సైదులు, రామస్వామి తదితరులు సందర్శించి విచారం వ్యక్తం చేశారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 
లక్ష్మీనగర్ సమీపంలో మరో రైతు..
లక్ష్మీనగర్ (తల్లాడ): లక్ష్మీనగర్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు మృతిచెందాడు. మల్లవరం పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామానికి చెందిన రైతు పునాటి శ్రీనివాసరావు(35).. అన్నారుగూడెం వైపు ఉన్న తన పొలానికి మోటార్ సైకిల్‌పై వెళుతున్నాడు. మార్గమధ్యలో అతని వాహనాన్ని కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు అతి వేగంగా వెళ్తున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను తల్లాడ ఆస్పత్రిలో మృతిచెందాడు. ఎస్‌ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు