రూ.లక్ష పోగొట్టుకున్న రైతు!

27 Apr, 2019 11:14 IST|Sakshi
బొప్పాయి కాయల బండి వద్ద కింద పడిపోయిన నగదును తీసుకుంటున్న మహిళ

అనంతపురం, కణేకల్లు: బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులోంచి లక్ష రూపాయలను ఓ రైతు పోగొట్టుకున్న ఘటన కణేకల్లులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు... బెళుగుప్ప మండలం తగ్గుపర్తికి చెందిన రైతు వెంకటనారాయణ పొలం కణేకల్లు మండలం పెనకలపాడు రెవెన్యూ పరిధిలో ఉంది. అతని బ్యాంకు లావాదేవీలన్నీ కణేకల్లు ఎస్‌బీఐలో ఉన్నాయి. శుక్రవారం కణేకల్లు ఎస్‌బీఐకి వచ్చిన వెంకటనారాయణ తన అకౌంట్‌లోంచి రూ.2లక్షలు డ్రా చేశాడు.

ఆ డబ్బును తన ద్విచక్ర వాహనం ముందు భాగంలో ఉన్న పెట్రోల్‌ ట్యాంకు కవర్‌ జేబులో పెట్టాడు. అనంతరం ఊరికి బయలుదేరాడు. బస్టాండ్‌లో బొప్పాయి కాయలు కొనేందుకు బైక్‌ ఆపాడు. ఆ సమయంలో పెట్రోలు ట్యాంకు కవర్‌ జేబులో ఉన్న డబ్బులో నుంచి రూ.లక్ష (రెండు కట్టలు) జారి కింద పడ్డాయి. బొప్పాయి కొన్న తర్వాత అతను నేరుగా ఊరికెళ్లాడు. ఇంటికెళ్లి చూడగా రూ.లక్ష మాత్రమే ఉంది. దీంతో డబ్బు పొగొట్టుకున్నానని తెలుసుకున్న అతను వెంటనే కణేకల్లుకు వచ్చి బ్యాంకు, బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో విచారించాడు. స్థానికుల నుంచి ఎలాంటి సమాచారమూ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు. బస్టాండ్‌ సర్కిల్‌ బొప్పాయి విక్రయించే చోట పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమరాలుండటంతో పోలీసులు విజువల్స్‌ పరిశీలించారు. కింద జారి పడిన డబ్బును ఓ మహిళ తీసుకెళ్లినట్లు బయటపడింది. ఆ మహిళ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆ మహిళా కణేకల్లు వాసా? లేక గ్రామీణ ప్రాంతానికి చెందినదా? అని పోలీసులు విచారణ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు