రైతు ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే

24 May, 2016 18:39 IST|Sakshi

చేబ్రోలు : రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిలో 90 శాతం మంది కౌలు రైతులేనని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జములయ్య విమర్శించారు. రెండు రోజులుగా గుంటూరు జిల్లా చేబ్రోలులోని పరిమి సత్యనారాయణ కల్యాణమండపంలో జరుగుతున్న కౌలురైతుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. అనంతరం జములయ్య విలేకరులతో మాట్లాడుతూ.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవటం, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడమే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణమని చెప్పారు.

రెండున్నర లక్షల మంది కౌలు రైతులకు రూ. 574 కోట్ల రుణమాఫీ జరగాల్సి ఉన్నప్పటికీ 50 శాతం కూడా మాఫీ కాలేదన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందజేస్తున్న విత్తనాలు, పురుగుమందులు, ఉపకరణాల్లో 30 శాతం కమీషన్ ద్వారా నాయకులు లబ్ధి పొందుతున్నారన్నారు. ఫలితంగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావటమే కాకుండా, రైతులకు నష్టం జరుగుతోందన్నారు. జాన్ 7, 8 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర మహాసభల్లో కౌలు రైతుల సమస్యల పరిష్కారంపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు