పోలీస్‌ అధికారి మందలించడంతో మనస్తాపం

30 Aug, 2019 08:43 IST|Sakshi
సలీం ఎక్కిన సెల్‌ టవర్‌ ఇదే..

భూమి రస్తా విషయంపై తగాదా

సాక్షి, రాజుపాళెం: పంట భూమి రస్తా విషయంపై రాజుపాళెం మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన వంగలి సలీం అనే యువకుడు గురువారం ఓ సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్‌ చేశాడు. ఇది గమనించిన ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్‌ సిబ్బంది రంగప్రవేశం చేసి ఎట్టకేలకు ఆ యువకుడిని కిందికి దించారు.  వివరాలు ఇలా ఉన్నాయి. వంగలి సలీం తండ్రి, వారి చిన్నాన్నకు కొర్రపాడు గ్రామ పొలంలో 364 సర్వే నంబరులో 80 సెంట్లు పంట భూమి ఉంది. ఈ భూమి గుండా దిగువనున్న 70 ఎకరాల రైతులు పొలం పనులు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆభూమిని కొలతలు వేయడంతో ఆభూమిలో ఎటువంటి రస్తా లేదని, ఇది పట్టా భూమి అని తెలుసుకున్న సలీం వారి కుటుంబ సభ్యులు దిగువనున్న రైతులను వారి భూమిలో నుంచి వెళ్లనీకపోవడంతో సమస్యగా మారింది. దిగువ నున్న రైతులు ఎన్నో ఏళ్లుగా ఆ  భూమిలో ఉన్న రస్తా నుంచే వెళ్లి పంటలు సాగు చేసుకుంటున్నామని రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే  నాలుగు రోజుల కిందట ప్రొద్దుటూరు రూరల్‌ సీఐ విశ్వనాథరెడ్డి వద్దకు వెళ్లగా రస్తా విషయంపై తగదా పడవద్దని చెప్పారు.

ఆ తర్వాత ఆయన నన్ను మందలించి, మా ఆడవాళ్లను అవమానకరంగా మాట్లాడాడని బాధితుడు సలీం వాపోయాడు. భూమిలో రస్తా విషయంపై పోలీస్‌ అధికారి మందలించడంతో తాను మనస్తాపానికి గురైయ్యాయని, 40 సెంట్లు రస్తాకే పోతే తన కుటుంబ జీవన పరిస్థితి ఎలాగని, తమ భూమి రస్తా విషయంలో రూరల్‌ సీఐ చర్యలు తీసుకుంటే తన చావుకు కారణం ఆయనేనని బాధితుడు పేర్కొన్నాడు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడితో చర్చలు జరిపారు. ఈభూమి రస్తా విషయంలో పోలీసుల జోక్యం ఉండదని చెప్పడంతో వెంటనే సలీం టవర్‌ దిగారు. దీంతో కుటుంబసభ్యులు, పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి తహసీల్దార్‌ ఉదయభారతి, ఎంపీడీఓ సయ్యదున్నీసా, ఏఎస్‌ఐ కేవీ సుబ్బయ్య వచ్చి  టవర్‌ ఎక్కిన సలీంతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్‌ బాధితుడి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు.


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా