రైతు ఆత్మహత్యాయత్నం

9 Nov, 2019 07:24 IST|Sakshi
కిరోసిన్‌ పోసుకున్న సురేంద్రనాయక్‌

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఘటన

భూ సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం

అనంతపురం, గాండ్లపెంట: భూ సమస్య పరిష్కారంలో రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ సురేంద్రనాయక్‌ అనే  రైతు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుటే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన శుక్రవారం గాండ్లపెంటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తుమ్మలబైలు పెద్దతండాలోని సర్వేనంబర్లు 274–7లోని 1.4 ఎకరాలు, 239లో 62 సెంట్ల స్థలంపై వివాదం నెలకొంది. ఆ భూమికి సంబంధించిన పట్టా తమవద్ద ఉందని, అదంతా తమదేనని దశరథనాయక్, తిరుపాల్‌నాయక్‌లు వాదిస్తుండగా... సర్వేనంబర్‌ 274–7, 239లోని భూమిలో తమకు చెందిన కొంత భూమి ఉందని గ్రామానికే చెందిన రఘనాయక్, శివానాయక్‌లు వాదిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇరువర్గాలు రెవెన్యూ అధికారులను ఆశ్రయించాయి. అయితే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో శుక్రవారం తిరుపాల్‌ నాయక్‌ తన కుమారుడు సురేంద్రనాయక్, కోడలు మాధవి, మరో రైతు దశరథ్‌నాయక్‌తో కలిసి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చాడు. వారంతా అధికారులతో మాట్లాడేందుకు కార్యాలయం లోనికి వెళ్లగా...బయటే ఉండిపోయిన సురేంద్రనాయక్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే  అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు అతన్ని నిలువరించారు. వెంటనే అక్కడికి చేరుకున్న తహసీల్దార్‌ నారాయణ, సర్వేయర్, ఆర్‌ఐ, వీఆర్వో, ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి సమస్య వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే? రెవెన్యూ అధికారులు తుమ్మలబైలు పెద్దతండా గ్రామానికి వెళ్లి వివాదానికి కారణమైన భూమిని పరిశీలించారు. త్వరలోనే ఎవరి భూమి ఎంత అనేది తేలుస్తామని, అంతవరకూ ఎవరూ ఈ భూమిలో ప్రవేశించవద్దంటూ ఓ బోర్డు ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు