అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

6 Aug, 2015 19:43 IST|Sakshi

బత్తలపల్లి: అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం వేల్పుమడుగు గ్రామానికి చెందిన గంగిరెడ్డిగారి విశ్వనాథరెడ్డి (35) అనే రైతు అప్పుల బాధతో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి, కామాక్షి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు అమర్‌నాథ్‌రెడ్డి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద కుమారుడు విశ్వనాథరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. వీరికి 11 ఎకరాల పొలముంది. వరుస పంట నష్టాలను ఎదుర్కొన్నారు. వర్షం లేక ఈసారి పంట సాగు చేయలేదు.

ఆదినారాయణరెడ్డి, కామాక్షి పేరుపై బత్తలపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ధర్మవరం కెనరా బ్యాంకులో రూ.2.55 లక్షలు పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ రూ.20 వేలు మాత్రమే అయ్యింది. అలాగే పంటల సాగు, ఇతరత్రా అవసరాల కోసం ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ.6 లక్షల వరకు అప్పులు చేశారు. వీటిని తీర్చే మార్గం కన్పించకపోవడంతో విశ్వనాథరెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఓ పని నిమిత్తం అనంతపురం వెళుతున్నట్లు ఇంట్లో చెప్పాడు. అక్కడికెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తూ వేల్పుమడుగు బస్‌స్టాప్ వద్ద మోనోక్రోటోఫాస్ తాగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతనికి భార్య జాన్సీలక్ష్మీ, మూడేళ్ల కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు