రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి శంకరనారాయణ

9 Jul, 2019 06:30 IST|Sakshi
సీకేపల్లి సభలో కేక్‌కట్‌ చేస్తున్న మంత్రి శంకరనారాయణ, కలెక్టర్‌ సత్యనారాయణ, చిత్రంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తదితరులు  

రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయం

మహానేత సేవలు వెలకట్టలేనివి

రైతు దినోత్సవంలో మంత్రి శంకరనారాయణ 

దివంగత సీఎం వైఎస్సార్‌కు ఘన నివాళి 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని మంత్రి శంకరనారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు.  వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని సోమవారం చెన్నేకొత్తపల్లిలో జరిగిన రైతు దినోత్సవంలో కలెక్టర్‌ సత్యనారాయణతో కలిసి వారు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.  అంతకుముందు వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్‌కట్‌ చేసి పంచిపెట్టారు. 

సాక్షి, కనగానపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని సోమవారం మండల కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయశాఖ మిషన్‌ సభ్యులు బోయ నరేంద్ర హాజరయ్యారు.

జలయజ్ఞం పేరుతో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన వైఎస్సార్‌ రైతు బాంధవుడయ్యారని మంత్రి గుర్తు చేశారు. అందుకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆయన జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. వైఎస్సార్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి రైతుల సంక్షేమం అనేక పథకాలను ప్రకటించారన్నారు. ‘రైతు భరోసా’ కింద పంట పెట్టుబడి కోసం ఏటా రూ.12,500, వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత పంటల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు.  

వైఎస్సార్‌ కలలను సాకారం చేస్తాం    
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం తిరిగి రావాలని ప్రజలంతా వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన కలలను సాకారం చేసేందుకు పాటుపడతామన్నారు.  వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాప్తాడు నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. నిత్యం కరువుతో అల్లాడుతున్న చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాల్లో కొత్తగా సాగునీటి రిజర్వాయర్లు నిర్మించటంతో పాటు, త్వరలోనే పేరూరు డ్యాంను కృష్ణా జలాలతో నింపుతామన్నారు.

అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహిళల డ్వాక్రా రుణాలను మాఫీ చేయటంతో పాటు ‘అమ్మఒడి’ పథకం ద్వారా విద్యాభివృద్ధి కృషి చేస్తామన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికి ఇళ్లు మంజూరు చేయిస్తామన్నారు. వ్యవసాయ, వాటి అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి.  డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు,   జేడీఏ హబీబ్‌బాషా, వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి, బిల్లే ఈశ్వరయ్య, గంగుల భానుమతి, సానే ఉమాదేవి, రాజారెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 


 

మరిన్ని వార్తలు