పరిహారం.. పరిహాసమే

8 Dec, 2014 01:37 IST|Sakshi

అష్టకష్టాలు పడి పంటలు సాగు చేసి ప్రకృతి ప్రకోపానికి బలైన రైతులకు ఊరట కలిగించేందుకు సర్కారు ఇస్తామంటున్న పరిహారం పరిహాసమవుతోంది. జరిగిన నష్టం నుంచి కోలుకుని మళ్లీ సాగుకు సమాయత్తమయ్యేందుకు రైతులకిచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ ఏళ్ల తరబడి వారికి అందడం లేదు. దీంతో అప్పుల పాలై అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
 
ఒంగోలు: పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను తక్షణమే ఆదుకునేందుకు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ మూడేళ్లుగా రైతుల దరి చేరడం లేదు. 50 శాతంపైగా పంట నష్టపోయిన వారికి దాదాపు రూ.57.91 కోట్ల సబ్సిడీ మొత్తం పంపిణీ కావాల్సి ఉంది.

- 2010 నవంబర్‌లో జల్ తుఫాను విరుచుకుపడింది. దీనికి సంబంధించి 72 మంది రైతులకు రూ.2.53 లక్షలు విడుదల కావాలి. నాలుగేళ్లు దాటినా..ఇంత వరకు రైతుల గోడు పట్టించుకునే వారే లేరు. 2011 ఫిబ్రవరిలో కురిసిన వర్షాలకు 28 మంది రైతులకు చెల్లించాల్సిన పరిహారం రూ.2.13 లక్షలు. అదే ఏడాది ఏప్రిల్‌లో అకాల వర్షాల దెబ్బకు 345 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరికి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.10.07 లక్షలు.
 - థానే తుఫాను ప్రభావంతో 6,925 మంది రైతులు నష్టపోయారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వీరికి ఇన్‌పుట్ సబ్సిడీ రూ.214.55 లక్షలు ఇస్తామని ప్రకటించారు.
 - 2011-12 కరువు ప్రాంతాల్లోని 66,660 మంది రైతులకు రూ.1819.16 లక్షలు ఇవ్వాల్సి ఉంది.
 - 2012 జనవరిలో కురిసిన అకాల వర్షాలకు 54331 మంది రైతులు నష్టపోయారు. వారికి రూ.1663.73 లక్షలు పరిహారం రూపంలో అందజేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.
 - 2012 నీలం తుఫాను వల్ల 307 మంది రైతులకు రూ.16.61 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో కురిసిన అకాల వర్షాలకు 1953 మంది రైతులు నష్టపోగా వారికి చెల్లించాల్సిన మొత్తం రూ.114.61 లక్షలు.
 - 2013 అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు 32,364 మంది రైతులు నష్టపోగా వారికి రూ.1948 లక్షలు పరిహారం ఇవ్వాల్సి ఉంది.  వీటి ప్రకారం మొత్తం లక్ష 62 వేల 985 మంది రైతులకు రూ.57 కోట్ల 91 లక్షల 39 వేల ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేయాల్సి ఉంది.  
 
తక్షణమే రైతులను ఆదుకోవాలి:మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
పంట నష్టపోయిన రైతులు వెంటనే మరోసారి పంట వేసుకునేందుకు ఇచ్చేది ఇన్ పుట్ సబ్సిడీ.. కానీ దానిని ఇంతవరకు రైతులకు విడుదల చేయకపోవడం బాధాకరం. 1.63 లక్షల మంది రైతులకు రూ.57.91 కోట్ల పంపిణీకి ప్రభుత్వం వెనుకాడుతుండటం సరైన చర్య కాదు. ప్రభుత్వం స్పందించి తక్షణం ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమచేయాలి.

మరిన్ని వార్తలు