రైతు ఇంటికి.. పండగొచ్చింది

16 Oct, 2019 09:47 IST|Sakshi

రైతు సంక్షేమమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం

ధరల స్థిరీకరణ నిధితో శనగ రైతులకు మేలు 

రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం ప్రారంభ సభలో మంత్రి మోపిదేవి

3.53 లక్షల రైతు కుటుంబాలకు రూ.277 కోట్ల పంపిణీ 

రైతు ఇంటికి పండగొచ్చింది.. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం చేతికి అందింది. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండుగ అని మరోసారి రుజువైంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రైతు భరోసా పథకంతో రైతులతోపాటు కౌలు రైతులకూ ఆర్థిక భరోసా లభించింది. తెనాలి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకాన్ని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ జ్యోతిప్రజ్వలన చేసి మంగళవారం ప్రారంభించారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభోత్సవంతో రైతు కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది.

సాక్షి, అమరావతి/గుంటూరు/కృష్ణా : ప్రజల కష్టాలను తనవిగా భావిస్తూ, వారి ఓటుతో అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఎన్నికల హామీలకు చట్టబద్ధత కల్పిస్తూ, వ్యవసాయం ప్రధాన అజెండాగా తండ్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డికి మిన్నగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. రైతులు ఎన్నడూ ఇబ్బందులు పడకూడదన్న భావనతో రైతుభరోసా–పీఎం కిసాన్‌ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మంది రైతులకు రూ.5,500 కోట్లను పెట్టుబడిసాయంగా ఇదేరోజున అందిస్తున్నట్టు చెప్పారు. నిరంతరం శ్రమించే రైతులకు తోడ్పడాలని పెట్టుబడి సాయంగా రూ.12,500 ఇవ్వాలని నిర్ణయించినా, వ్యవసాయ మిషన్‌ సమావేశంలో అభిప్రాయం ప్రకారం రూ.13,500లకు పెంచినట్టు వివరించారు.

ఈ మొత్తాన్ని ప్రస్తుత సంవత్సరం రెండు విడతలుగా, వచ్చే ఏడాది నుంచి మూడు దఫాలుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారని వివరిం చారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మోపిదేవి మాట్లాడుతూ మార్కెట్‌లో పంటకు ‘మద్దతు’ లేనప్పుడు ఆదుకోవటానికి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటును ప్రస్తావించారు. మూడేళ్లుగా పంటకు ధరలేక కష్టాల్లో ఉన్న ఆరు జిల్లాల్లోని శనగ రైతుల పంటను రూ.350 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు గుర్తుచేశారు. ఈ–క్రాప్‌లో నమోదులేని కారణంగా రైతులు నష్టపోతున్నారని గ్రహించి, ఆ నిబంధనను సవరించిన ముఖ్యమంత్రి విశాల హృదయం కారణంగా, కేవలం ఒక్క ప్రకాశం జిల్లాలోనే లక్ష మంది శనగ రైతులకు నష్టపరిహారం లభించే పరిస్థితి ఉందన్నారు. ఉల్లి ధరల అదుపుకు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి కిలో రూ.25 చొప్పున విక్రయిస్తూ, ఈ వ్యత్యాసాన్ని స్థిరీకరణ నిధి నుంచి ప్రభుత్వం భరించిందని పేర్కొన్నారు.

టమాటా రైతుల కోసం మార్కెటింగ్‌ ఏజెన్సీని ఏర్పాటుచేసి పల్ప్‌ యూనిట్లతో ఒప్పందాలు చేసుకుని ప్రాసెసింగ్‌ అనంతరం ఎగుమతికి, మిగలిన వాటిని హాస్టల్సు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని భావిస్తున్నామని చెప్పారు. ఎక్కడా రైతులు ధర లేక నష్టపోకూడదన్నదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశంగా చెప్పారు. ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతింటే ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో విపత్తునిధిని తీసుకొచ్చారని చెప్పారు. పంటల బీమాకు రైతులు ప్రీమియం చెల్లించే పనిలేకుండా రూ.2,470 కోట్లను రాష్ట్రప్రభుత్వం జమచేసిందన్నారు. 

చంద్రబాబు హయాంలో అవినీతి 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని సొంత జాగీరుగా భావించి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయటమే కాకుండా రాష్ట్ర ఖజానాలో పూచికపుల్ల లేకుండా చేశారని మంత్రి మోపిదేవి వెంకటరమణరావు విమర్శించారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లలో రాష్ట్ర గౌరవాన్ని పోగొట్టారని దుయ్యబ ట్టారు. ఈ క్రమంలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అవినీతి రహిత పాలనకు పాటుపడుతున్నారని చెప్పారు. నాలుగు నెలల్లోనే ఎలాంటి అవినీతి, సిఫార్సులు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా 1.36 లక్షల సచివాలయ ఉద్యోగాలను కల్పించిన ఘనత జగన్‌దేనని ఈ సందర్భంగా స్పష్టంచేశారు.  
    
నవంబర్‌ 15 వరకు గడువు
జిల్లాలోని 3.53 లక్షల రైతులకు పెట్టుబడిసాయంగా రూ.277 కోట్లను అందజేస్తున్నట్టు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ చెప్పారు. ప్రజాసాధికార సర్వే చేయనందున 80 వేల మంది, ఆధార్‌ సీడింగ్‌ లేని 60 వేల మంది జాబితాలో నమోదు కాలేదని చెప్పారు. వీరందరికీ మరో నెలరోజులు అంటే నవంబర్‌ 15వ తేదీవరకు గడువునిచ్చినట్టు చెప్పారు. ఆలోగా సాధికార సర్వే, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ సీడింగ్‌ చేయించుకుని, పెట్టుబడిసాయం పొందవచ్చని చెప్పారు. నియోజకవర్గ పరిశీలకురాలు హెనీ క్రిస్టినా తన ప్రసంగంలో రైతులపై జగన్‌ అపారమైన ప్రేమను చాటుతున్నట్టు చెప్పారు. సభానంతరం రైతులు, కౌలు రైతులకు వేర్వేరుగా పెట్టుబడి సాయం చెక్కులను, కౌలు అంగీకారపత్రాలను, కూరగాయల చిరు సంచులను, పసుపు రైతులకు ఐపీఎం కిట్లను మంత్రి మోపిదేవి చేతుల మీదుగా అందజేశారు.

వ్యవసాయశాఖ జేడీఏ ఎం.విజయభారతి స్వాగతం పలికిన సభలో తెనాలి సబ్‌కలెక్టర్‌ కె.దినేష్‌కుమార్, మార్క్‌ఫెడ్‌ డీఎం నళిని, ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు, డీఎస్పీ కె.శ్రీలక్ష్మి, తెనాలి, కొల్లిపర తహసీల్దార్లు కె.రవిబాబు, యశోద, వ్యవసాయాధికారులు వెంకటనరసయ్య, అక్తర్‌ హుస్సేన్, వైఎస్సార్‌ సీపీ నేతలు దేసు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, ఆరిగ చంద్రారెడ్డి, బూరెల దుర్గా, తాడిబోయిన రమేష్, కరాటపు రాజమోహన్, యలవర్తి సాంబశివరావు, షేక్‌ దుబాయ్‌బాబు, జలగం రామకృష్ణ, హరిదాసు గౌరి, మల్లెబోయిన కొండాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.   

రైతు సంక్షేమమే సీఎం లక్ష్యం
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రసంగిస్తూ.. రైతు బాంధువుడిగా, అపర భగీరథుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిన డాక్టర్‌ వైఎస్‌ బాటలోనే జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు. పెట్టుబడిసాయాన్ని అందిస్తున్న ప్రభుత్వానికి రైతులు పెద్దమనసుతో సహకరించాలని కోరారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల్లో పెట్టుబడిసాయం కింద రైతులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు. రైతులు తమ భూములకు కౌలు అంగీకారపత్రాలను నిరభ్యంతరంగా ఇవ్వొచ్చని, దీనివల్ల కౌలుదార్లకు ఎలాంటి హక్కు ఉండదన్నారు. ఆ ప్రకారం ప్రభుత్వం చట్టం చేసిందన్నారు.

కరువు, చంద్రబాబు కవలలు
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పిలిస్తే వర్షాలు పలికాయని మోపిదేవి గుర్తుచేశారు. నదులన్నీ జలకళతో పొంగాయనీ, రైతులు సుఖ సంతోషాలతో ఉన్నట్టు చెప్పారు. చంద్రబాబు పగ్గాలు చేపట్టాక నదుల్లో నీటిచుక్క లేదన్నారు. మళ్లీ జగన్‌ సీఎం కాగానే గత 10–15 ఏళ్లలో ఎన్నడూలేనట్టుగా శ్రీశైలం, సాగర్‌ జలాశయాలకు ఆరు పర్యాయాలు గేట్లను ఎత్తి, వరదనీటిని దిగువకు వదలాల్సి వచ్చిందన్నారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలనీ, వరుణుడు, వైఎస్‌ కుటుంబం ఆత్మబంధువులని పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు
‘‘నా పేరు బొంతు కిశోర్‌రెడ్డి. మాది కొల్లిపర మండలంలోని కొత్తబొమ్మువానిపాలెం, చివలూరు గ్రామాల్లో మూడెకరాల సొంత భూమి, మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. పదేళ్లుగా మెట్టలో పసుపు, అరటి, మాగాణిలో వరి, మొక్కజొన్న/అపరాలు సాగు చేస్తున్నా. కొన్ని సార్లు గాలికి అరటి పంట దెబ్బతిని నష్టం వచ్చింది. కృష్ణానదికి వరదలొచ్చినప్పుడు, వర్షాభావ పరిస్థితుల్లో పంటలు దెబ్బతిని నష్టపోయా. అప్పుడు కనీసం పెట్టుబడి కూడా రాక తీవ్ర ఇబ్బందులతో మళ్లీ అప్పులు చేసి పంటలు సాగు చేశా. ప్రభుత్వం కొంత మేర ఆదుకుంటే బాగుండేది అని భావించేవాళ్లం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఇచ్చే రూ.13.500 వెసులుబాటుగా ఉంటుంది. కుటుంబంపై ఆ మేరకు భారం తగ్గుతుంది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. 

మరిన్ని వార్తలు