బతికి బట్టకట్టేదెలా?

21 Dec, 2013 02:30 IST|Sakshi

 మన్నును నమ్ముకున్న రైతన్నలకే కాదు- మగ్గాన్ని నమ్ముకున్న నేతన్నలకూ మనుగడ గండంగా మారిపోతోంది. తెల్లని దారపుపోగుల నుంచి వన్నెలవన్నెల వస్త్రాలను సృష్టించే వారి బతుకులు వెలసిపోతున్నాయి. సమాజానికి గుడ్డ సమకూర్చే వారికి కూడు కనాకష్టమయ్యే గడ్డుకాలం దాపురిస్తోంది. వారికి అండగా నిలవాల్సిన చేనేత సహకార సంఘాలు.. చిక్కులు పడ్డ దారపు ఉండను సరి చేయాల్సి వచ్చినట్టు... దిక్కుతోచని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.         
 
 బతికి బట్టకట్టేదెలా?
 సాక్షి, కాకినాడ :
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిన్నచూపు, మూడు నెలల పాటు సాగిన సమైక్య ఉద్యమం, వరుస తుపాన్లు, భారీ వర్షాలతో చేనేత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పుండు మీద కారం చల్లినట్టు.. చేనేత వస్త్రాలకు ఇచ్చే 20 శాతం రిబేట్‌ను కేంద్రం పూర్తిగా రద్దు చేసింది. పండుగ సీజన్‌లో గిరాకీ ఉన్నా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ లేకుండా పోయింది. దీనికి తోడు ఆప్కో కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో సొసైటీల్లో కోట్లాది రూపాయల వస్త్ర ఉత్పత్తులు పేరుకుపోయాయి. అటు సొసైటీలు నష్టాల పాలై, ఇటు చేనేత కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోయే దుస్థితి నెలకొంది.
 
 జిల్లాలో లక్ష మందికి పైగా మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉప్పాడ, బండార్లంక, గొల్లప్రోలు, పుల్లేటికుర్రు, మోరి, కె.జగన్నాథపురం, ద్వారపూడి, విలసవిల్లి తదితర గ్రామాల్లో సుమారు 18,061 గోతిమగ్గాలుండగా, ఒక్కో మగ్గంపై నలుగురు చొప్పున సుమారు 80 వేల మంది వరకు ఆధారపడి జీవిస్తున్నారు. మగ్గంపై ఆధారపడే కుటుంబంలో నలుగురు కలిసి రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తుంటారు. జిల్లాలో 50 చేనేత సహకార సంఘాలున్నాయి. వీటికి డీసీసీబీ రూ.12 కోట్ల మేర రుణ సౌకర్యం కల్పించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఇప్పటికే సొసైటీల వద్ద రూ.7.5 కోట్ల విలువైన చేనేత ఉత్పత్తులు పేరుకుపోయాయి. ముఖ్యంగా అంగర, పులగుర్త, మోరి తదితర సొసైటీల్లో నిల్వలు భారీగా ఉన్నాయి. నెలల తరబడి ఉండిపోవడం వలన ఈ ఉత్పత్తుల నాణ్యత కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
 
 అమ్మేదెలాగో అగమ్యగోచరం..
 ప్రొడక్షన్ ప్రోగ్రామ్ (పీపీ) కింద ప్రభుత్వం జిల్లాలో ఆప్కోకు తొలి అర్థ సంవత్సరంలో రూ.3.15 కోట్లు మంజూరు చేసింది. ఇటీవలే రెండో అర్థ సంవత్సరానికి సంబంధించి రూ.2.66 కోట్లు విడుదల చేసింది. సొసైటీల వద్ద ఏడున్నర కోట్ల విలువైన ఉత్పత్తులు పేరుకుపోవడంతో పీపీ కింద రూ.ఆరు కోట్లు మంజూరు చేయాలంటూ జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపగా కేవలం రూ.2.66 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ మొత్తంతో సొసైటీల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ఎలా కొనుగోలుచేయాలో పాలుపోని స్థితిలో ఆప్కో ఉండగా.. 20 శాతం రిబేట్ రద్దు చేయడంతో ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక సొసైటీలు అయోమయంలో పడుతున్నాయి. ఉత్పత్తి అయిన వస్త్రాల్లో మూడో వంతైనా ఆప్కో కొనుగోలు చేస్తే తప్ప కార్మికులకు సొసైటీలు పని కల్పించలేని పరిస్థితి నెలకొంది. పీపీ కింద మంజూరైన రూ.2.66 కోట్లను కూడా రానున్న ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా సొసైటీల నుంచి వస్త్ర నిల్వలు కొనుగోలు చేసే వెసులుబాటునిచ్చారు. ఈ నెలాఖరులోగా రూ.1.33 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయనుండగా, మిగిలిన రూ.1.33 కోట్ల విలువైన ఉత్పత్తులను ఫిబ్రవరిలో కొనుగోలు చేస్తారు. మిగిలిన ఉత్పత్తులను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక సొసైటీ పాలకవర్గాలు దిక్కులు చూస్తున్నాయి.
 
 కనీసం 20 శాతం రిబేట్‌ను పునరుద్ధరిస్తే కొద్దొగొప్పో ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోగలుగుతామని చెబుతున్నారు. జిల్లాలో 12 వేల మంది కార్మికుల ఉపాధిపై రిబేట్ రద్దు తీవ్ర ప్రభావం చూపుతోంది.  జిల్లాలో 50 సంఘాలకు గాను 47 సంఘాలకు 20 శాతం రిబేటును పొందేందుకు అర్హత ఉంది. రిబేట్ రద్దు వల్ల గత ఏడు నెలలో రూ.75 లక్షలకు పైగా అమ్మకాలు తగ్గిపోవడంతో ఆ మేరకు ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ఇప్పటికే ఆప్కో ద్వారా సంఘాలకు రావాల్సిన బకాయిసొమ్ము రూ.10 కోట్లకు పైనే ఉంది. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు నూలుపై రిబేటు రూపంలో దాదాపు రూ.3.5 కోట్లు విడుదల కావాల్సి ఉంది.
 
 సంఘాల మనుగడ కష్టమే..
 ప్రస్తుతం సొసైటీల్లో రూ.25 కోట్ల విలువైన వస్త్రాలు తయారయ్యే అవకాశముండగా ఆప్కో కనీసం రూ.6 కోట్ల విలువగల వస్త్రాలు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. ఉత్పత్తిలో మూడో వంతైనా కొనుగోలు చేస్తే తప్ప సంఘాలు మనుగడ సాగించలేవు. రిబేటు లేకపోవడం వల్ల సంఘాల్లో దుస్తులు పేరుకుపోయాయి. కనీసం రిబేటైనా ఇస్తే దుస్తులు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవడానికి సాధ్యమవుతుంది.
 - చింతా వీరభద్రేశ్వరరావు, మోరి చేనేత సొసైటీ అధ్యక్షుడు
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా