ఇదేం తీరు(వా)

28 Jun, 2015 01:59 IST|Sakshi
ఇదేం తీరు(వా)

- అన్నదాతపై నీటితీరువా పిడుగు
- అమాంతం రెట్టింపయిన పన్ను
- అధికారుల వద్ద గత లెక్కలు లేని వైనం
- పక్కదారి పడుతున్న వసూలు
- లెక్కాజమా లేని తీరు
సాక్షి, విశాఖపట్నం:
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది అన్నదాతల పరిస్థితి. పుట్టెడుకష్టాల్లో ఉన్న వీరిపై నీటితీరువా పెంచుతూ ఇటీవల సర్కార్ తీసుకున్న నిర్ణయం గుది బండగా మారుతోంది. జిల్లాలో 6,98,702 ఎకరాల సాగుభూమి ఉంది. ఈ భూమిలో సాగునీటి వనరులు కింద 2,83,412 ఎకరాల భూమి సాగవుతుంటే, మరో 4,36,132 ఎకరాల భూమి పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగవుతుంది.

జిల్లాలో మేజర్ అండ్ మీడి యం ఇరిగేషన్ ప్రాజెక్టులైన తాండవ కింద 51,465, రైవాడకింద15,344, కోనాం కింద 12,628,  పెద్దేరు జలాశయం కింద 19,969 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే వంద ఎకరాలకు పైబడిన ఆయకట్టు ఉన్న 236 మీడియం ఇరిగేషన్ టాంక్స్ (చెరు వులు) కింద మరో 59వేలఎకరాల ఆయకట్టు ఉంది. ఈ నీటితో పంటలు పండించు కున్న రైతులు ప్రభుత్వానికి నీటితీరువా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పెద్ద ప్రాజెక్టుల కింద పంటలు పండించుకునే రైతులు వరికైతే ఎకరాకు ఏడాదికి ఒక పంటకు రూ.200,చెరువుల కింద రూ.100 చొప్పున, అదే చెరకుకైతే ఎకరాకు రూ.350 చొప్పున వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలో చెరువులు, చిన్న, మధ్యతరహా నీటి వనరుల కింద సాగయ్యే లక్షా 80వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీటి తీరువా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.2.25కోట్ల ఆదాయం రావాల్సి ఉంది.

ఏటా కోటి మాత్రమే వసూలవుతుందని అధికారులు చెబుతున్నారు. గత 10 ఏళ్లలో రావాల్సిన నీటి తీరువా ఏకంగా రూ.21కోట్లకు పైగా పేరుకుపోయిందని అధికారిక అంచనా. వాస్తవంగా క్షేత్ర స్థాయి సిబ్బంది మాత్రం నీటి తీరువాను వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.  ఉజ్జాయింపుగా చెప్పడమే తప్ప ఏ మండల పరిధిలో డిమాండ్ ఎంత? ఎంత వసూలైంది.? ఎంత బకాయి ఉందో చెప్పలేని పరిస్థితి.  తాజాగా ప్రభుత్వం నీటి తీరువా రెట్టింపు చేసింది.

ప్రస్తుత డిమాండ్ రూ.2.25 కోట్లు నాలుగున్నర కోట్లకు చేరుకోనుంది.పెట్టుబడి వ్యయంతో భారం గా మారినసాగు చేయలేక తల్లడిల్లుతున్న రైతులపై నీటితీరువా భారం కానుంది. ఖరీఫ్ సీజన్ నుంచే నీటితీరువా పెంపు అమలులోకి రానుం డడంతో పెరగనున్న భారంతో పాటు పాత బకాయిలను కూడా సీజన్ పూర్తయ్యేలోగా వసూలు  చేసుకోవాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మండలాల వారీగా నీటితీరువా బకాయిల జాబితాలను సిద్దం చేయాలని తహశీల్దార్లను జేసీ ఆదేశించారు.
 
నీటితీరువా
పెంచడం సరికాదు   
           
తిమ్మరాజుపేటలో నాకు ఎకరంన్నర వరి ఉంది. ఏటా నీటితీరువా ఎకరాకు రూ.300  చెల్లిస్తున్నాను. గత ఆరేళ్లుగా అధికారులు నీటితీ రువా సక్రమంగా వసూలు చేయ డం లేదు. ప్రభుత్వం సాగునీటి సమస్యలు పట్టించుకోకుండా నీటితీరు వా పెంచడం సరికాదు. రైతులు మరింత ఇబ్బంది పడ తారు.
 -భీమరశెట్టి గణేష్‌నాయుడు, వ్యవసాయరైతు, తిమ్మరాజుపేట
 
కాలువలు
బాగు చేయకుండా పెంపా

సాగునీటి ఇబ్బందులను పట్టించుకోని ప్రభుత్వం నీటి తీరువాను పెంచడం సరికాదు. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. దీనిలో వరి, చెరకు పంటలు పండిస్తున్నాను. వరికి ఎకరానికి రూ.100, చెరకుకు రూ.350 చెల్లిస్తున్నా. కాల్వలు పూడికతో ఉండటం వల్ల సక్రమంగా నీరు అందకపోయినా ప్రతీఏటా నీటితీరువా చెల్లిస్తున్నా.
 -వెలగా రమణ, రైతు,
 జి.కోడూరు, మాకవరపాలెం మండలం

మరిన్ని వార్తలు