మినుము రైతుకు ‘మద్దతు’ కరువు

28 Jan, 2014 03:16 IST|Sakshi

పీసీ పల్లి, న్యూస్‌లైన్ :
 మినుము రైతుకు ప్రభుత్వం, అధికారులు, వ్యాపారుల నుంచి మద్దతు కరువైంది. ఆరుగాలం శ్రమించి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటకు రెండేళ్లుగా మద్దతు ధర లేకపోవడంతో పాటు పెట్టుబడులు పెరగడం, దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించకుంటే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 పీసీ పల్లి మండలంలోని గుంటుపల్లి, తురకపల్లి, శంకరాపురం, మూలవారిపల్లి, పెదయిర్లపాడు, విఠలాపురం, చింతగుంపల్లి, లక్ష్మక్కపల్లి తదితర గ్రామాల్లో మినుము పంటను అధికంగా సాగు చేస్తారు. మండలంలో సాధారణంగా 1,278 హెక్టార్లలో మినుము సాగుచేయాల్సి ఉండగా, ఈ ఏడాది 1,118 ెహ క్టార్లలో సాగుచేశారు. కాగా, సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంట ఏపుగా పెరగలేదు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పంట చేతికిరాగా, దిగుబడి ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది. దీనికితోడు రెండేళ్లుగా మినుము పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. క్వింటా 8 వేల రూపాయలైతేగానీ రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి. కానీ, రెండేళ్లుగా క్వింటా 6 వేల రూపాయల ధర మాత్రమే పలుకుతోంది. ఈ ఏడాదైతే 4,800 రూపాయలకు పడిపోయింది. అసలే దిగుబడి తగ్గి, పెట్టుబడులు పెరిగి అప్పుల భారంతో అల్లాడుతున్న రైతుకు ఈ ఏడాది ఒకేసారి 1,200 రూపాయలు తగ్గిన మద్దతు ధర నిద్రలేకుండా చేస్తోంది.
 
 ఎకరాకు రూ.15 వేల వరకూ పెట్టుబడి...
 ఎకరా పొలంలో మినుము పంట సాగుచేసేందుకు ప్రస్తుతం 15 వేల రూపాయల వరకూ ఖర్చవుతోంది. గత ఏడాది ఎకరాకు 2 వేల రూపాయలున్న కౌలు ప్రస్తుతం 3 వేల రూపాయలకు పెరిగింది. అదే విధంగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలి ఖర్చులన్నీ పెరిగాయి. కానీ, వాతావరణం అనుకూలించక ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. దానిప్రకారం రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 5 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తే తప్ప పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. దీనికితోడు ఈ ఏడాది గిట్టుబాటు ధర కూడా పడిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
 రైతుల ఇళ్లలోనే పంట...
 రెండేళ్లుగా మద్దతు ధరలు లేకపోవడంతో మినుము రైతులు పండించిన పంటను అమ్మకుండా ఇళ్లలోనే ఉంచుకున్నారు. కొంతమంది మాత్రం అప్పుల బాధ తాళలేక తక్కువ ధరకే అమ్ముకున్నప్పటికీ మిగిలినవారు మాత్రం ఈ ఏడాదైనా గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశతో ఇళ్లలోనే ఉంచుకున్నారు. కానీ, మద్దతు ధర రాకపోగా, గతేడాది ఉన్న ధర కూడా 1,200 రూపాయలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధర కల్పించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు