వ్యవసాయానికి సడలింపు

26 Mar, 2020 04:11 IST|Sakshi

సామాజిక దూరం పాటిస్తూ రైతులు కార్యకలాపాలు చేసుకోవచ్చు

వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాల రవాణాలోనూ ఇబ్బందులు ఉండవు.. కలెక్టర్లకు ఉత్తర్వులు

సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌ డౌన్‌ ఆంక్షల నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, శాంతి భద్రతలు పర్యవేక్షించే ఉన్నతాధికారులకు ఉత్తర్వులు పంపారు. 

మినహాయింపులు ఇవీ..
- సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలు చేపట్టవచ్చు. 
తమ పొలాల్లో పండించే వ్యవసాయ ఉత్పత్తులను కూడా రవాణా చేసుకోవచ్చు. నిత్యావసర వస్తువుల ఉత్పత్తితో సంబంధమున్న తయారీ యూనిట్లను నిర్వహించుకోవచ్చు.
- రబీ పంటల కోతలను నిర్వహించుకోవచ్చు. కోత అనంతరం పంట నూర్పిడి, ఆరబెట్టడం, గోతాల్లో నింపుకోవడం వంటివి చేపట్టవచ్చు. వచ్చే సీజన్‌కు విత్తనాలను ప్యాకింగ్‌ చేసుకోవచ్చు.
- హైబ్రీడ్‌ మొక్కజొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పత్తి, పప్పుధాన్యాలు, వరి, వేరుశనగ, కూరగాయల విత్తనాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శుద్ధి కేంద్రాలకు తరలించుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న విత్తన నిల్వ, పరీక్ష, శుద్ధి, గ్రేడింగ్, ప్యాకింగ్‌ వంటి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించవచ్చు.
- వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన పొలం పనులు చేసుకోవచ్చు. ముడి విత్తనాలను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించుకోవచ్చు. 
- ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన విత్తన కంపెనీలు అన్ని జాగ్రత్తలతో తమ విత్తనాలను తరలించవచ్చు. నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలు చేపట్టవచ్చు. అయితే ఇవన్నీ లాక్‌ డౌన్‌ నిబంధనలకు లోబడి చేపట్టాలి. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఎరువులు, పురుగు మందుల కంపెనీలు కూడా తగు జాగ్రత్తలతో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. రైల్వే గిడ్డంగుల నుంచి ఎరువులను తమ ప్యాకింగ్‌ పాయింట్లకు తరలించే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లాక్‌ మార్కెటింగ్‌కు లేదా ఒకే చోట పెద్దఎత్తున నిల్వ చేసేందుకు అవకాశం లేదు.
- ఎరువులు, పురుగు మందుల షాపులు తెరిచి ఉంటాయి. రైతులు మూడు అడుగుల దూరంలో ఉంటూ కొనుక్కోవాలి. 
- నిత్యావసర వస్తువులు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని తీసుకువెళ్లే వాహనాలకు అధికారులు అనుమతి ఇస్తారు.
- గిడ్డంగుల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వాటిని నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ప్రమాదం లేకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. 
- లాక్‌డౌన్‌ కాలానికి కార్మికులు, ఇతర ఉద్యోగులకు వేతనాలు పూర్తిగా ఇవ్వాలి. ఐదుగురుకు మించి ఒకే చోట పని చేయకుండా, గుమికూడకుండా చర్యలు తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు