భూమి కోసం.. ప్రాణార్పణకు సిద్ధం

16 Nov, 2018 12:55 IST|Sakshi
సెల్‌టవర్‌ ఎక్కిన రైతు నరసింహులు రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ సుబ్బలక్ష్మమ్మ

సెల్‌ టవరెక్కి ఉరేసుకుంటానని భీష్మించిన రైతు

30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని లేకుండా చేశారని ఆవేదన

అధికారుల హామీతో ప్రయత్నాన్ని విరమించుకున్న అన్నదాత

ఆ భూమితో అతడికి 30 ఏళ్ల అనుబంధం. తాను చిన్నప్పటి నుంచి ప్రాణంగా చూసుకుంటున్నది. బ్యాంకులో రుణం పొంది ఆ మట్టిలోనే భవిష్యత్తును వెతుక్కున్నాడు. ఆ మట్టితల్లి కరుణతోనే తన సంతానం ఆరుగురిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేశాడు. అలాంటి భూమిని అధికారులు చెరువుతొట్టి పేరుతో రికార్డుల నుంచి తొలగించడాన్ని తట్టుకోలేకపోయాడు. అధికారులందరి కాళ్లుపట్టి ప్రాథేయపడ్డాడు. తహసీల్దార్, ఎమ్మెల్యే.. కలెక్టర్‌.. చివరకు ముఖ్యమంత్రి దృష్టికి సైతం తన సమస్యను తీసుకుపోయాడు. అయితే ఎక్కడా తన సమస్యకు పరిష్కారం దొరకలేదు. దీంతో దిక్కుతోచక సెల్‌ టవర్‌ ఎక్కి ప్రాణార్పణకు సిద్ధమయ్యాడు.

అనంతపురం, అమడగూరు: తన పేరును పట్టాదారుపుస్తకం, 1బీలో తొలగించారంటూ ఓ దళిత రైతు మండల కేంద్రంలో సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గురువారం సంచలనం సృష్టించింది. బాధిత రైతు వివరాల మేరకు..గుండువారిపల్లికి చెందిన  రైతు సోమగుట్ట నరసింహులుకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. వీరందరికీ పెళ్లిళ్లయ్యాయి.

నరసింహులు అదే పంచాయతీలో సర్వే నంబరు 417లో ఉన్న 4–32 ఎకరాల భూమిని 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. అదే భూమిపై అమడగూరు ఏపీజీబీలో కొన్నేళ్ల క్రితమే రుణం తీసుకుని రెన్యూవల్‌ చేసుకుంటున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం చెరువు తొట్టి, వాగు, వంకల భూమిని ఎవరైనా స్వాధీన పర్చుకున్నట్లయితే వెంటనే ఆయా భూముల వివరాలను రికార్డులను తొలగించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. దీంతో నరసింహులు సాగు చేసుకుంటున్న 4–32 ఎకరాల భూమి కూడా చెరువుతొట్టిగా భావించిన అధికారులు పట్టదారు పాస్‌పుస్తకం, ఒన్‌బీలో ఆ భూమిని తొలగించారు. దీంతో రైతు కొన్నేళ్లుగా తన భూమిని తనకు ఇవ్వాలంటూ పలుమార్లు రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి సచివాలయం, ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి  కూడా విన్నవించుకున్నాడు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.

‘పల్లె’ వచ్చే దాకా దిగను..
తీవ్ర మనోవైదనకు గురైన రైతు ఉదయం 8 గంటల సమయంలో అమడగూరు బస్టాండు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్‌ ఎక్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించాడు.  పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని కిందికి దించేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. ‘ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నన్ను చులకనగా మాట్లాడాడు, ఎమ్మెల్యే వచ్చే దాకా దిగను’ అంటూ స్పష్టం చేశాడు. ఎక్కడెక్కడో ఉన్న రైతు కుటుంబ సభ్యులను పిలిపించి వారితో చెప్పించినా ససేమీరా అన్నాడు. చివరకు తహసీల్దార్‌ సుబ్బలక్ష్మమ్మ త్వరలో అసైన్డ్‌మెంట్‌ కమిటీ నిర్వహిస్తామని, రైతు ఇద్దరు కోడళ్ల పేరు మీద నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టా, పాస్‌పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చింది. కుటుంబసభ్యులు కూడా ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దని బతిమాలడంతో కిందకుదిగాడు. దాదాపు 5 గంటలపాటు టవర్‌పై ఉన్న రైతు కిందకు దిగడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు