కేశవరెడ్డి స్కూల్‌ ఎదుట నిరసన

15 Jun, 2019 07:18 IST|Sakshi

సాక్షి, నంద్యాల(కర్నూలు) : పాణ్యం మండలం నెరవాడ వద్ద ఉన్న కేశవరెడ్డి స్కూల్‌ ఎదుట యాళ్లూరు గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. గ్రామానికి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తేనే  ఇక్కడి నుంచి  వెళ్లేదని భీష్మించుకు  కూర్చున్నారు. పాణ్యం సీఐ వంశీకృష్ణ జోక్యం చేసుకుని కేశవరెడ్డి కుమారుడు మంగళవారం నాటికి వాయిదా కోరాడని చెప్పడంతో నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అనంతరం యాళ్లురు రైతుసంఘం మాజీ అధ్యక్షులు బెక్కెం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 2015లో కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డికి రూ.24 లక్షలు అప్పుగా ఇచ్చామని తెలిపారు.

అ డబ్బంతా గ్రామనికి చెందిన మాతా అరవిందమ్మ ఆశ్రమం, దేవాలయం, గ్రామ అభివృద్ధికి దాచుకున్నదని తెలిపారు.  రూ.24 లక్షలకు రూ.2 వడ్డీ ప్రకారం ఏటా చెల్లిస్తానని చెప్పడంతో గ్రామపెద్దలందరూ కలిసి అప్పుగా ఇవ్వడం జరిగిందన్నారు. తీసుకున్న తర్వాత రెండేళ్లు వడ్డీ చెల్లించి తర్వాత సంవత్సరం నుంచి డబ్బులు చెల్లించడం నిలిపివేశాడన్నారు. గ్రామస్తులు వడ్డీ చెల్లించాలని అడిగితే శ్రీకాకుళంలో వెంచర్‌ వేశామని, అది అమ్ముడు పోతే మొత్తం నగదు చెల్లిస్తానని నమ్మబలికాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అప్పటి నుంచి వడ్డీ, అసలు చెల్లించకుండా గడువు చెబుతూ కాలం వెల్లదీశాడని చెప్పుకొచ్చారు.

కొంత కాలం తర్వాత గ్రామపెద్దలంతా కేశవరెడ్డిని గట్టిగా నిలదీస్తే రూ.6లక్షలు ఇచ్చి మిగతా సొమ్మంత కొంత వ్యవధిలోనే పూర్తిగా చెల్లిస్తానని నమ్మబలికాడన్నారు.  తర్వాత కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారని, ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి సొమ్ము ఇవ్వలేదని తెలిపారు.  సీఐ ఇచ్చిన హామీ మేరకూ మంగళవారం కేశవరెడ్డి కుమారుడు అప్పు చెల్లించకపోతే బుధవారం స్కూల్‌ గేట్‌కు తాళాలు వేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు బెక్కెం బాలతిమ్మారెడ్డి, బెక్కెం చిన్నరామకృష్ణారెడ్డి, కైప జగన్నాథరెడ్డి, గంగుల వెంకటచంద్రారెడ్డి, గంగుల తిమ్మారెడ్డి, బెక్కెం మధుసుదన్‌రెడ్డి, బెక్కెం చంద్రశేఖర్‌రెడ్డి , పోగుల వెంకట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు