స్వేదం చిందిస్తే..కన్నీరే మిగిలే !

30 Mar, 2019 12:31 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం :  ‘నింగి వెన్నపూస వాడు.. నేల వెన్నుపూస నువ్వు’ అంటూ సినీకవి సుద్దాల అభిమానంగా రాసుకున్నా, ‘వాడు చెమటోడ్చి ప్రపంచమునకు  భోజనము పెట్టు / కానీ వానికి భుక్తి లేదు’ అంటూ జాషువా పాలకుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేసినా, ‘పొలాలనన్నీ / హలాల దున్నీ / ఇలాతలంలో/ హేమంపిండే’ అంటూ శ్రీశ్రీ  మొత్తుకున్నా అదంతా నాగలి పట్టి భూమాతను నమ్ముకున్న కర్షకుల స్వేదయాగం గురించే.

నారు వేసిన నాటి నుంచి ధాన్యం ఇంటికి చేరే వరకు రైతన్న జీవితమంతా నమ్మకం మీదనే సాగుతుంది. అసలు భూమికి–రైతుకి ఓ విడదీయలేని బంధమే ఉంటుంది. అయితే ప్రకృతి చేసే ప్రకోపానికి, పాలకులు చేసే అకృత్యాలకు చేష్టలుడిగిపోవడం మినహా వీరికి మరో గత్యంతరం కనపడటం లేదు.  అరచేతిలో గీతలు అరిగిపోయేదాకా అరకతిప్పినా గుప్పెడు గింజలు ఇంటికి రాలేని పరిస్థితి నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతన్నది. ఇక పాలుతాగుతున్న పొత్తిళ్ల బిడ్డ నీట మునిగితే మాతృమూర్తి ఎలా తల్లడిల్లుతుందో తుపానులు అదే తరహాలో రైతన్న గుండెను పిండేశాయి.

పొలం నుంచి పళ్లెంలోకి.. అక్కడి నుంచి నోటి వరకు చేర్చడంలో రైతన్న పడే ప్రయాస  పచ్చపాలకుల  కళ్లకు కానరాలేదు ఈ ఐదేళ్లలో. ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన ఏలికలు పత్తా లేకపోతే కనిపించిన చోటల్లా చేసింది అప్పులే.  రుణమాఫీ, పంటల బీమా అంటూ ఏవోవో పేర్లు పెట్టేసి ఆపద కాలంలో నాలుగు చల్లటి మాటలు చెప్పి ఊరడించిన పాలకులు ఆ తరువాత తమ ముఖం చూడకపోతే రైతు బిక్కం ముఖం వేయక ఇంకేం చేస్తాడు. ఐదేళ్లలో టీడీపీ   ప్రభుత్వం వ్యవసాయ రంగంపై చూపిన నిర్లక్ష్యాన్ని ఓ మారు రైతుకు గుర్తు చేస్తే కస్సుమంటున్నాడు.తమకేం చేశారో చెప్పాలంటూ నిగ్గదీస్తున్నాడు.

పంట సాగుకు అనువైన సమయంలో ప్రభుత్వం సాగునీటిని విడుదల జాప్యం చేయడం.. ధాన్యానికి మద్దతు ధర లేకపోవడం.. పంట చేతికొచ్చే సమయంలో పెథాయ్‌ తుపాను దెబ్బతీయడం.. పూర్తిస్థాయిలో పంట నష్ట పరిహారం అందక, రుణమాఫీకి నోచుకోక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నష్టాన్ని రబీలోనైనా పూడ్చుకుందామనుకుంటే దాళ్వా సాగుకు ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడంతో ఐదేళ్ల పాటు కర్షకులకు కన్నీళ్లు తప్పలేదు. 

జిల్లాలో ఇదీ దుస్థితి  
జిల్లాలో ప్రతి ఏటా ఖరీఫ్‌లో వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, కంది, మినుము, వేరుశనగ, నువ్వులు, పత్తి, మిరప, చెరకు, పసుపు తదితర పంటలు  సాగవుతాయి. ఖరీఫ్‌ సాగు సాధారణ సాగు విస్తీర్ణం 3.23 లక్షల హెక్టార్లు కాగా.. ఏటా 3.28 నుంచి 3.48 లక్షల హెక్టార్ల వరకు సాగవుతోంది. రబీలో సైతం లక్ష హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి.  

కలగానే నీటి విడుదల 
జిల్లా వ్యాప్తంగా సాగునీరందించేందుకు ప్రధానంగా మూడు కాలువలున్నాయి.  కేఈబీ, బందరు కాలువ, ఏలూరు, రైవస్‌ కాలువలకు కలిపి రోజుకు 10,000 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా.. కేవలం 5,300 క్యూసెక్కుల మాత్రమే విడుదల చేశారు. ఈ పరిణామం పంటలపై పడింది. నీరందక ఎండుముఖం పట్టిన సందర్భాలు సైతం ఉన్నాయి.  

నత్తనడకన ధాన్యం సేకరణ  
2.47 లక్షల హెక్టార్లకు 13.40 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అందుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 323 కొనుగోలు కేంద్రాల ద్వారా 9.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 7.40 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించారు. దీంతో చేసేది లేక రైతులు ధన్యాన్ని తక్కువ ధరకు బహిరంగ విపణిలో దళారులకు విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. 

పెరిగిన పెట్టుబడి వ్యయం 
వరిసాగుకు రైతులకు ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. కోత దశకు వచ్చే సమయానికి ఎకరానికి రూ.35,000 వరకు పెట్టుబడి పెట్టారు. దీనికి తోడు కోత కూలీ, కుప్పలు వేసేందుకు కూలీ, పురుగు మందుల ధరలు ఇలా మరో రూ.5 వేలు వెచ్చించాల్సి ఉంది. ఎకరానికి సగటున రూ.40 వేలు పెట్టుబడి పెట్టారు. 

తుపాను కల్లోలం 
వరి కోత సమయంలో రైతులను పెథాయ్‌ తుపాను కల్లోలం సృష్టించింది. మూడు రోజుల పాటు కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 47,000 హెక్టార్లలో పంట నీట మునిగింది. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రూ.27 కోట్లు నష్టం వాటిల్లిందని తొలుత అధికారులు అంచనాలు రూపొందించారు. అనంతరం జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి రూ.525 కోట్లు పంట, గొర్రెలు, రహదారులు నష్టం వాటిల్లినట్లు జిల్లా అధికారులు కేంద్రానికి నివేదించారు. అయితే ఇప్పటి వరకు కేవలం రూ.14 కోట్ల మేర బీమా మంజూరు చేశారు. నష్టపరిహా రంలో మాత్రం నయాపైసా విడుదల చేయలేదు. 

రుణమాఫీ ఊసేదీ?
జిల్లాలో రుణమాఫీ పరిస్థితి దారుణంగా తయారైంది. రుణమాఫీకి 4,44,972 మంది రైతులు అర్హత సాధించారు. మొత్తం రూ.1507 కోట్లు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా రూ.577 కోట్లు, రెండో విడతగా రూ.232, మూడో విడతగా రూ.232 కోట్లు విడుదల చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా మూడో విడత రుణామాఫీనే ఇప్పటికీ 30 శాతం మంది రైతులకు అందలేదు. ఇక నాలుగో విడత, ఐదో విడత అందడమన్నది పెరుమాళ్లకెరుక.

ఐదేళ్లలో 48 మంది మృతి!
టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా 48 మంది రైతులు వ్యవసాయంలో నష్టాలు రావటంతో పంటసాగు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. జీఓ నెంబర్‌ 421 ప్రకారం అప్పులబాధ తాళలేక చేసుకున్న ఎలాంటి ఆత్మహత్యనైనా రైతు ఆత్మహత్యగా గుర్తించాలి.

కానీ ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెట్టి మరికొంత మందిని ఈ జాబితాలోకి చేర్చకపోవడంతో రైతు కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో డిమాండ్‌ చేస్తే.. రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. కానీ ఇందులో సింహభాగం కుటుంబాలకు ఇప్పటికే అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

కనీస మద్దతు ధర లేదు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దత ధర లభించడం లేదు. ధాన్యం అమ్మిన సొమ్ము కోసం అధికా రులు చుట్టూ తిరగడమే సరిపోయింది. నాకు ఉన్న నాలుగు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని అమ్ముకున్నా. ధాన్యం ఒకరు తీసుకున్నారు. సొమ్ములకు మరొకరిని కలవమంటున్నారు. రోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. కాళ్లు అరుగు తున్నాయి తప్ప కనికరించే వారు కరువయ్యారు. వెళ్లిన ప్రతిసారి అధికారులకు విన్నవించినా పట్టించుకోని పరిస్థితి ఉంది. వ్యవసాయానికి చేసిన అప్పులుకు వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడ్డాం. అప్పులు ఎలా తీర్చాలి, ఇంట్లో ఎలా తినాలి.
– సగ్గుర్తి నాగభూషణం, పుల్లూరు, మైలవరం 

మరిన్ని వార్తలు