దారుణ భారం

21 Feb, 2016 00:11 IST|Sakshi

 చిన జగ్గంపేట (గొల్లప్రోలు) : పంట చేతికి దక్కకపోగా.. సాగు చేయడానికి చేసిన అప్పులు వడ్డీతో పెరిగి ఉరితాడై ఆ కౌలు రైతు పీకను చుట్టుకున్నాయి. అప్పులు తీర్చే దారిలేకపోవడంతో చినజగ్గంపేట గ్రామానికి చెందిన కౌలు రైతు మొగలి సుబ్బారావు ఉరి వేసుకుని శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన అప్పారావు పత్తి పంట సాగు చేయడంతో పాటు జీడిమామిడి తోటల్లో దిగుబడిని కొనుగోలు చేస్తుంటాడు. ఈ ఏడాది 4 ఎకరాల పొలాన్ని రూ.60 వేలకు కౌలుకు తీసుకుని, పత్తి సాగు చేశాడు. సుమారు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులు, నాసిరకం విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో చే తికందిన పంటతో కనీసం పెట్టుబడి కూడా దక్కలేదు. సాగుకు చేసిన అప్పులు పేరుకుపోయాయి. కాగా గతేడాది శ్రీకాకుళం జిల్లాలో జీడిమామిడితోట ఫలసాయాన్ని కొనుగోలు చేశాడు. హుద్‌హుద్ తుపాను కారణంగా తోటలు తుడుచుపెట్టుకుపోవడంతో రూ.1.50 లక్షల మేర అప్పుల పాలయ్యాడు. పత్తి, జీడిమామిడి పంటలకు సుమారు రూ.3.5 లక్షల మేర అప్పులు పేరుకుపోయాయి.
 
 వారం రోజులుగా మనోవేదన
 అప్పులు ఎలాతీర్చాలో తెలియక వారం రోజులుగా అప్పారావు మనోవేదనకు గురైనట్టు స్థానికులు పేర్కొన్నారు. అప్పుల విషయమై భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్థలు తలెత్తేవని తెలిపారు. కొన్ని సందర్భాల్లో భోజనం చేయకుండా ఇంటి వద్దే నీరసంగా కనిపించేవాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెడలో ఉన్న తువాలుతో ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం ఉదయం భార్య వెంకటలక్ష్మి లేచి చూసేసరికి అప్పారావు విగతజీవుడై కనిపించడంతో ఆమె గుండెలవిసేలా రోదించింది.
 
 రెక్కల కష్టంపైనే..
 ఇలాఉండగా అప్పారావుకు భార్య వెంకటలక్ష్మితో పాటు కుమార్తెలు నాలుగో తరగతి చదువుతున్న కృష్ణవేణి, ఒకటో తరగతి చదువుతున్న దుర్గారేవతి ఉన్నారు. మేనత్త అచ్చమ్మ, అన్నయ్య కుమారుడు వెంకటరమణను అతడే రెక్కల కష్టంపై పోషిస్తున్నాడు. అతడి మరణంతో ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది. తండ్రి మృతదేహాన్ని అమాయకంగా చూస్తూ చిన్నారులు.. ‘నాన్న.. నాన్న’ అంటూ కన్నీరుపెట్టుకోవడం చూపరుల హృదయాలను కలచివేసింది. తనను ఎవరు చూస్తారంటూ మేనత్త అయిన 70 ఏళ్ల అచ్చమ్మ కన్నీరుమున్నీరైంది. కనీసం పక్కా ఇల్లు కూడా లేకుండా, తాటాకింట్లో ఉంటున్న అప్పారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ గాది వెంకన్న, ఎంపీటీసీ సభ్యుడు గుర్రం సుబ్బారావు కోరారు.
 

మరిన్ని వార్తలు