రైతును ముంచిన శనగ

17 Jun, 2018 14:42 IST|Sakshi
గోదాములో నిల్వ చేసిన శనగ ధాన్యం 

తగ్గిన దిగుబడి

గిట్టుబాటు ధర కరువు

బ్యాంకు రుణం తీసుకున్న రైతులకు నోటీసులు

పట్టించుకోని ప్రభుత్వం  

సాక్షి, రాజుపాళెం : రైతులను శనగ పంట ముంచేసింది. ప్రకృతి సహకరించక, ప్రభుత్వం పట్టించుకోక వారు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది రబీలో జిల్లాలో 84480 హెక్టార్లలో శనగ సాగు చేశారు. విత్తనం వేశాక ఒక్క వాన కూడా పడకపోవడంతో పంట పూర్తిగా ఎండుముఖం పట్టింది. ఎకరాకు కేవలం 2 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రతి రైతు ఎకరాకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, ట్రాక్టరు బాడుగలు, కూలీలు తదితర వాటి కోసం రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేశారు. 


ధర అంతంత మాత్రమే...
శనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం క్వింటా ధర రూ.3500 పలుకుతోంది. గతంలో రైతులు విత్తనం వేసేటప్పుడు కొనుగోలు చేయగా.. క్వింటా రూ.7 వేలు పలికింది. ఇలా ధర వ్యత్యాసం ఉంటే ఎలా గట్టెక్కుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.8000 కల్పించి ఉంటే.. పరిస్థితి కొంత వరకు బాగుండేదని వారు పేర్కొన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.14 వేలు చెల్లించి కౌలుకు తీసుకున్నారు. దీంతో పెట్టుబడులు కూడా చేతికి అందలేదు. అటు అప్పులు కట్టలేక, ఇటు ధాన్యం అమ్ముకోలేక సందిగ్ధంలో ఉన్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. చాలా మంది రైతులకు టోకన్లు దొరకక అమ్ముకోలేదు. మరి కొంతమంది రైతులు శనగ పంట నూర్పిడి తర్వాత పొలాల్లోనే వ్యాపారులకు అనామత్‌ (ధాన్యం వేశాక ఎప్పుడైనా అమ్ముకోవచ్చు) వేశారు. ప్రభుత్వ గోదాములు నిండిపోవడంతో చాలా మంది ప్రైవేటు గోదాములను ఆశ్రయించారు. ఒక్కో బస్తాకు ఏడాదికి రూ.130 బాడుగ చెల్లిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ చూపి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.


రైతులకు వేలం నోటీసులు
ఒక వైపు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగానికి బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడంతో.. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గోదాముల్లో ఉంచిన ధాన్యాన్ని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. గతంలో క్వింటా ధర రూ.10 వేలు పలికింది. ఇలాంటి ధర వచ్చిన తర్వాత అమ్ముకుందామని కొందరు రైతులు భావించారు. అయితే ఏడాది గడిచినా ధర తక్కువగా ఉండటంతో అమ్ముకోలేక పోయారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించక ఏడాది పూర్తి కావడంతో.. బ్యాంకర్లు రైతులకు వేలం నోటీసులు పంపారు. ఆ తర్వాత శనగలు వేలం వేస్తామని పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించి, రుణాలను రెన్యువల్‌ చేయాలని కోరినా బ్యాంకర్లు వినుకోవడం లేదు. గతంలో క్వింటా ధర రూ.6000 నుంచి రూ.6500 వరకు ఉండటంతో.. బ్యాంకులు క్వింటాకు రూ.3500 నుంచి రూ.4500 వరకు రుణం ఇచ్చాయి. ప్రస్తుతం క్వింటా రూ.3500 పలుకుతుండటంతో తీసుకున్న అప్పునకు కూడా సరిపోవడం లేదు. 


ఎమ్మెల్యేను కలిసిన రైతులు
రుణం చెల్లించకుంటే ఈ నెల 22న వేలం వేస్తామని బ్యాంకులు పత్రికల్లో ప్రకటన ఇచ్చాయి. దీంతో రాజుపాళెం మండలంలోని పలు గ్రామాల రైతులు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని కలిసి, పరిస్థితి వివరించారు. ఎమ్మెల్యే వెంటనే బ్యాంక్‌ మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ‘రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు ఫలానా రోజు కట్టాలని చెప్పలేదు కదా.. ఉన్నట్టుండి ఇప్పుడు కట్టమంటే ఎలా కడతారు. కాదు కూడదు రుణం వడ్డీతో సహా చెల్లించాలంటే నేనే చెల్లిస్తా. గాంధీ మార్గంలో దీక్ష చేస్తా. శనగలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయనీయబోం’ అని మేనేజర్‌కు ఎమ్మెల్యే చెప్పారు.

మరిన్ని వార్తలు