అన్నదాతలకు ఊరట

31 Mar, 2020 12:42 IST|Sakshi
కాశినాయన మండలం పాపిరెడ్డిపల్లెలో కోల్డ్‌ స్టోరేజీలకు తరలించేందుకు బస్తాల్లో మిర్చిని నింపుతున్న రైతులు

వ్యవసాయ పనులకు అనుమతి

కూలీల మధ్య భౌతికదూరం పాటించాలని సూచన

పంటల అమ్మకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షిప్రతినిధి కడప : కరోనా కష్టాల్లోనూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్నదాతల కోసం ఆంక్షలు సడలించింది. రైతులు పండించిన పంటలను ఇంటికి తెచ్చుకోవడానికి కూలీలను పనులకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.జిల్లా వ్యాప్తంగా సాగైన అరటి పంటను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం గుంటూరు మార్కెట్‌యార్డు మూతపడిన నేపథ్యంలో మిర్చి పంటను కోల్డ్‌ స్టోరేజీల్లో దాచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా కష్టాల్లోనూ తమ పంటలను అమ్ముకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్‌లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. 

కరోనా వైరస్‌ భయంతో ప్రభుత్వం ఇప్పటికే లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో దాదాపు 40 వేల ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంట సగం పంట పొలాల్లోనే ఉండిపోయింది. మరోవైపు రాజంపేట, పులివెందుల, మైదుకూరు ప్రాంతాలలో 20 వేల హెక్టార్లలో సాగు చేసిన అరటి పంట కోత దశకు చేరింది. తొలుత కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లకూడదని ప్రభుత్వం సూచించింది. దీంతో గ్రామ స్థాయిలో వలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది కూలీలు గుంపులుగా వెళ్లకూడదంటూ ఆంక్షలు పెట్టారు. దీంతో రైతుల పంటలు పొలాల్లోనే ఉండిపోయాయి. ఈ విషయం మండల, జిల్లా స్థాయి అధికారులకు చేరడంతో కూలీలపై ఆంక్షలు సడలించారు.వీరు వ్యవసాయ పనులకు వెళ్లొచ్చని, కాకపోతే భౌతిక దూరం పాటించాలని వారు సూచించారు. 

ఎగుమతులకూ అవకాశం
ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కృషితో అరటి పంట ఎగుమతి చేసుకునే అవకాశం రైతులకు కలిగింది. అధికారులు అనుమతి ఇవ్వడంతో మూడు రోజులుగా తొమ్మిది వేల టన్నుల అరటిని ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు స్వేచ్చగా ఎగుమతులు చేసుకున్నారు. మిగిలిన 10 వేల టన్నులను మరికొద్దిరోజుల తర్వాత ఎగుమతి చేయనున్నారు.

కోల్డ్‌ స్టోరేజీలకు మిర్చి తరలింపు
జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో రైతులు 40 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల గుంటూరు మిర్చి యార్డును ప్రభుత్వం మూసి వేసింది. దీంతో మిగిలి ఉన్న మిర్చిని రైతులు ఇళ్ల వద్దనే ఉంచుకోవాల్సి వచ్చింది. అకాల వర్షాలతో మిర్చి దాచుకునేందుకు వసతి లేకపోవడంతో కోల్డ్‌ స్టోరేజీలకు తరలించేందుకు అనుమతులు ఇవ్వాలని రైతులు అధికారులను పదేపదే కోరారు. స్పందించిన కలెక్టర్, ఎస్పీలు మిర్చి తరలింపుకు అనుమతులు ఇచ్చారు. దీంతో గత నాలుగు రోజులుగా మిర్చి రైతులు మిర్చి పంటను గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కోల్డ్‌ స్టోరేజీలకు లారీల ద్వారా తరలిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదే శాలతో ఎక్కడికక్కడ పోలీసులు మిర్చి రవాణాకు అనుమతించడంతో రైతులకు కష్టాలు తప్పాయి.

మరిన్ని వార్తలు