వంగ రైతు బెంగ

16 Dec, 2013 01:52 IST|Sakshi

తాడేపల్లి రూరల్/తుళ్లూరు, న్యూస్‌లైన్:  వంగ రైతులకు బెంగ పట్టుకుంది. అదుపుకాని పుచ్చు తెగులుతో అల్లాడుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పురుగు మందులు పిచికారీ చేస్తున్నా తెగులు అదుపు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని తాడేపల్లి, తూళ్లూరు, నారాకోడూరు, బుడంపాడు తదితర ప్రాంతాల్లోని రైతులు ఈ ఏడాది దాదాపు 500 ఎకరాల్లో వంగ సాగు చేపట్టారు.

తొలి నుంచి తోటలు ఏపుగా పెరగడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించారు. అయితే వరుస తుపానులతో తోటలు అక్కడక్కడా దెబ్బతిన్నాయి. వీటిని బతికించుకోవడానికి మళ్లీ ఎదురు పెట్టుబడులు పెట్టిన రైతులకు నిరాశే మిగిలింది. తోటలను పుచ్చుతెగులు ఆశించడంతో పంట దిగుబడి పడిపోయింది. 90 శాతం కాయలు పుచ్చులతో రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని మందులు వాడినా అదుపుకాకపొవడంతో కాయ కోసి పారవేస్తున్నారు. ఎకరా వంగ సాగుకు సుమారు రూ. 70 వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా ధర రూ. 1000 నుంచి రూ. 1500 వరకు పలుకుతోంది. తుళ్లూరు మండలంలోని శాఖమూరుకు చెందిన రైతు చింకా శంకరరావు ఎకరా నేలలో వంగతోట సాగు చేశారు. దిగుబడి వచ్చేసరికి అన్ని ఖర్చులు కలుపుకుని  రూ. 70 వేలు పెట్టుబడి అయింది.

కొద్దిరోజుల నుంచి  పుచ్చుతెగులు సోకి పంట అంతా దెబ్బతింది. దీంతో దిగుబడిలో ఎక్కువ శాతం కాయ పుచ్చులు పుచ్చులుగా వస్తున్నాయి. ఐదు బస్తాల్లో ఒక్క బస్తా మంచి కాయ మాత్రమే లభించిందని శంకరరావు తెలిపారు. దీంతో పురుగు మందులు, కూలీల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలం కుంచనపల్లి రైతు నల్లపు కోటయ్య కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఎకరా పొలాన్ని రూ. 30 వేలకు కౌలుకు తీసుకుని రూ. 70 వేలు ఖర్చు పెట్టి వంగ సాగు చేపట్టాడు. పంట ఏపుగా పెరిగి చేతికి అందివచ్చే సమయానికి తెగులు తగిలింది. తన పంటకు సోకిన తెగులు ఏమై ఉంటుందోనని ఆందోళన చెంది మండల వ్యవసాయాధికారి కార్యాలయానికి వెళితే అక్కడ తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏ ఒక్క అధికారి లేకపోవడంతో వెనుదిరిగాడు. వచ్చిన నష్టానికి కుమిలిపోతున్నాడు.

మరిన్ని వార్తలు