అన్నదాత గుండెల్లో మంచు మంటలు

18 Dec, 2013 03:45 IST|Sakshi

 శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్:  ఖరీఫ్ చివరిలో వరుస దాడులతో అన్నదాతలను అతలాకుతలం చేసిన ప్రకృతి ఇంకా కక్ష తీరినట్లు లేదు. రైతన్నల జీవితాల్లో మంచు మంటలు రేపుతోంది. సెప్టెం బర్ చివరి వారం నుంచి తుపాన్లు, భారీ వర్షాలతో అధిక శాతం ఖరీఫ్ పంటలు నాశనమయ్యాయి. మిగిలిన కొద్దిపాటి ఆహార పంటలతోపాటు కూరుగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంట లను గత కొద్దిరోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచు కబళి స్తోంది. వీటికి తోడు జిల్లాలో కొన్ని చోట్ల రబీ సాగు మొదలైంది. ఈ పంటలకు ప్రస్తుతం మంచు, తెగుళ్ల బెడద తీవ్రంగా ఉంది. ఈ  ఏడాది రబీ వ్యవసాయానికి మొదట్లో వరద దెబ్బ తగిలింది. దీంతో చాలా వరకు రైతులు నష్టపోయారు. దాని నుంచి తేరుకునే లోగానే మిరప, వంగ, టమాటా, చిక్కుడు, మినుము, పెసర తదితర పంటలకు మంచు, తెగుళ్లు తీవ్రంగా నష్టపరుస్తున్నాయి.

జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో ఉన్న పంట లకు ఇదే సమస్య ఎదురవుతోంది. ఒక్క శ్రీకాకుళం మండలంలోనే సుమారు 500 ఎకరాల్లో మిరపతో పాటు అధిక విస్తీర్ణంలో పెసర, మినుము, వంగ, టమాటా, చిక్కుడు వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పిలి, కళ్ళేపల్లి, కనుగులవానిపేట, బలివాడ, వాకలవలస, బావాజీపేట, రాగోలు, మన్నయ్యపేట తదితర గ్రామాల్లో, పొందూరు, జి.సిగడాం తదితర ప్రాంతాల్లో మిరప సాగులో ఉంది. అదే విధంగా ఎచ్చెర్ల, కోటబొమ్మాళి, కవిటి, గార తదితర మండలాలతోపాటు శ్రీకాకుళం రూరల్ మండలంలోని బావాజీపేట, వాకలవలస, నందగిరిపేట, మన్నయ్యపేట, రాగోలు తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున కూరగాయలు ఆసగు చేస్తున్నారు. అపరాల పంటల విస్తీర్ణం కూడా బాగానే ఉంది. ఈ పంటలకు కీలకమైన ఈ సమయంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న మంచు వల్ల మొక్కలు ముడసర వేసి ఎదుగుదల కోల్పోతున్నాయి.

ఆకుముడత, తెల్లమచ్చ సోకుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి చాలా రోజులు అవుతున్నా మొక్కలు పెరగడం లేదని, ఎన్ని మందులు కొట్టినా ఫలితం కనిపించడంలేదని ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది ఈ సమయానికే మిరప పంట చేతికి అందిందని, మంచు, తెగుళ్ల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు పూత దశకే రాలేదని అంటున్నారు. ఖరీఫ్‌తో పాటు రబీ కూడా పోయే పరిస్థితి ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మినుము, పెసర, చిక్కుడు పంటల్లో తెల్లదోమ తెగులు విపరీతంగా ఉందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు