హెలెన్ దెబ్బకురైతు విలవిల

24 Nov, 2013 03:29 IST|Sakshi

జిన్నారం: ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో మండలంలోని పలు ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. వరి గింజలు చేలులోనే పడిపోతున్నాయి. ఆరు నెలలుగా కష్టపడి సాగు చేసుకున్న రైతులు తుపాన్ కారనంగా వర్షాలు కురుస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిన్నారం, గుమ్మడిదల, అనంతారం, వావిలాల, సోలక్‌పల్లి తదితర గ్రామాల్లో చేతికి వచ్చిన వరి పంట నేలవాలింది. దీంతో రైతులు కంట నీరుపెడుతున్నారు.
 తుక్కాపూర్‌లో నీటిపాలు
 తొగుట: మండలంలోని తుక్కాపూర్ వ్యవసాయ మార్కెట్‌లోని ధాన్యం వర్షార్పణమైంది. మార్కెట్లో డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడంతో వర్షం నీరు అక్కడే నిలవడంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు కంటతడిపెట్టారు. మార్కెట్లో పాసైన ధాన్యం కుప్పలు, పాసవ్వడానికి సిద్ధంగా ఉన్న కుప్పలు సుమారు 5 వేల బస్తాలుండగా శనివారం నాటి వర్షానికి తడిసిపోయింది. కొంత ధాన్యం కొట్టుకుపోయింది. మార్కెట్‌లో  కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడం వల్లే ధాన్యం నీటిపాలైందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బస్తాలను తూకం వేసినా అధికారుల నిర్లక్ష్యంతో లారీల కొరత కారణంగా లోడింగ్ కాకపోవడంతో బయట ఉన్న బస్తాలు సైతం వర్షానికి తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.
 
 కొనుగోలు చేయకనే..
 చిన్నకోడూరు: మండలంలోని జక్కాపూర్, చిన్నకోడూరు, ఇబ్రహీంనగర్, రామంచ, అల్లీపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు తడిసిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేయడానికి కొనుగోలు కేంద్రాల్లో గోదాములు, కవర్లు, తదితర సౌకర్యాలు లేకపోవడంతో వర్షానికి తడిసినట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తెచ్చి రెండు, మూడు రోజులు గడిచినా నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.తడిసిన ధాన్యాన్ని వెంటనే కోనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలకు ఆయా గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి.

మరిన్ని వార్తలు