‘కోత’లపై కన్నెర్ర

14 Feb, 2014 02:11 IST|Sakshi

తిరుమలాయపాలెం, న్యూస్‌లైన్: అప్రకటిత విద్యుత్ కోతలపై అన్నదాత ఆగ్రహించాడు. అప్పులు తెచ్చి సాగుచేసిన పంటలు ఎండిపోతుండటంతో ఆందోళనకు సిద్ధమయ్యాడు. బావుల నిండా నీళ్లున్నా ఎడాపెడా విద్యుత్‌కోతలు విధిస్తుండటంతో పంటలు నాశనమవుతున్నాయంటూ మండలంలోని బచ్చోడు సబ్‌స్టేషన్‌ను రైతులు గురువారం ముట్టడించారు. సుమారు ఎనిమిది గంటలపాటు ఆందోళన నిర్వహించారు.

 అక్కడే వంటావార్పు కానిచ్చారు. రైతులు అన్ని గంటలపాటు ఆందోళన చేసినా విద్యుత్ అధికారులు ఎవరూ అందుబాటులోకి రాలేదు. రైతుల ఆందోళన విషయం తెలిసి ఎస్సై ఓంకార్‌యాదవ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యుత్ అధికారులతో రైతులను ఫోన్‌లో మాట్లాడించారు. సబ్‌స్టేషన్‌ను శుక్రవారం సందర్శించి సమస్యను పరిష్కరిస్తానని విద్యుత్‌శాఖ ఏడీ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

 పూర్వాపరాల్లోకి వెళ్తే...
 ఆందోళనకు సంబంధించి రైతులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని బచ్చోడు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో కొంతకాలంగా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గంట కూడా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడం లేదు. ఇన్‌కమింగ్‌లో అంతరాయం ఏర్పడినప్పుడు అదనపు సమయంలో సరఫరా ఇవ్వడం లేదు. వ్యవసాయబావుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు.

 నిత్యం నీరు నిల్వ ఉండాల్సిన ఈ పంట విద్యుత్ కోతల కారణంగా ఎండిపోతోంది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి సాగుచేసిన వరితో పాటు మిరప పంట కూడా ఎండిపోతోంది. సబ్‌స్టేషన్ పరిధిలో ఎైదె నా విద్యుత్ అంతరాయం ఏర్పడినా విద్యుత్ అధికారులు పట్టించుకోకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. విసిగి వేసారిన బచ్చోడు, బచ్చోడుతండాకు చెందిన రైతులు స్వచ్ఛందంగా కదిలారు. విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద టెంటు వేసి ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా బయటకు వెళ్లకుండా నిలుపుదల చేయించి గేటువేసి అప్రకటిత విద్యుత్ కోతలు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన నిర్వహించారు.

 ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తే తమ పంటల పరిస్థితి ఏమిటంటూ  రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఆందోళన చేసినా మధ్యాహ్నం వరకు విద్యుత్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. విద్యుత్ కోతలతో ఉరివేసుకునే పరిస్థితి వచ్చిందని ఓ రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఆందోళన కొనసాగింది. విషయం తెలిసి ఎస్సై ఓంకార్‌యాదవ్ అక్కడికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని రైతులను కోరారు. విద్యుత్ అధికారుల నుంచి స్పష్టమైన హామీ వస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు తేల్చి చెప్పారు.

 విద్యుత్‌శాఖ ఏడీకి ఎస్సై ఫోన్ చేసి రైతులతో మాట్లాడించారు. శుక్రవారం ఉదయం బచ్చోడు సబ్‌స్టేషన్ కు వచ్చి సమస్యలను తెలుసుకుని విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తానని ఏడీ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులకు వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం, టీడీపీ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు అంగిరేకుల నర్సయ్య, ధర్మాచారి, తోట శ్రీను, ఎన్నెబోయిన రమేష్, సకి నాల వెంకన్న, చింతల యాదగిరి, జక్కుల యాదగిరి, పల్లె మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు