ఏ ముఖంతో రాజధానిలో పర్యటన?

26 Nov, 2019 03:53 IST|Sakshi
సోమవారం వెలగపూడిలోని సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న రాజధాని ప్రాంత రైతులు

ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొట్టే యత్నాలపై రైతుల మండిపాటు

క్షమాపణ చెప్పకుండా వస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిక

భూములు తీసుకుని ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆగ్రహం

సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/ తుళ్లూరు: అమరావతి పేరుతో అన్ని రకాలుగా మోసగించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తొలుత బహిరంగ క్షమాపణ చెప్పాలని రాజధాని రైతులు, దళితులు డిమాండ్‌ చేశారు. రైతులకు సమాధానం చెప్పకుండా రాజధానిలో పర్యటిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ఉండగా తమను నానా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని రాజధానిలో పర్యటిస్తారని స్థానిక రైతులు ప్రశ్నించారు. వెలగపూడిలోని సచివాలయం సమీపంలో రాజధాని గ్రామాలకు చెందిన రైతులు మాదల మహేంద్ర, శృంగారపు సందీప్, బెజ్జం రాంబాబు, తుమ్మల రమణారెడ్డి, కొండేపాటి బుజ్జి, బొర్రా శివారెడ్డి తదితరులు సోమవారం మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రకటన సమయంలో టీడీపీ నేతలతో పంట పొలాలు తగులబెట్టించి వైఎస్సార్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. తాత్కాలిక భవనాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదు?, పర్మినెంట్‌ భవనాలు ఎందుకు కట్టలేదు? అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో దోచుకుని ఇప్పుడు పర్యటనకు సిద్ధం కావడం సిగ్గు చేటన్నారు. 

గ్రాఫిక్స్‌తో నాలుగేళ్లు కాలక్షేపం..
రైతులను రెచ్చగొట్టేందుకే చంద్రబాబు ఈనెల 28న రాజధాని ప్రాంతంలో పర్యటన తలపెట్టారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండగా తమ అభిప్రాయాలు సేకరించకుండా భూములు తీసుకున్నారని, గ్రామ సభల్లో ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించారని చెప్పారు. భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదని, హామీలను సైతం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకిచ్చిన ప్లాటు ఎక్కడుందో కూడా తెలియదని, భూములు తీసుకుని అన్ని రకాలుగా మోసం చేశారని వాపోయారు. రాజధాని నిర్మిస్తున్నామంటూ గ్రాఫిక్స్‌ బొమ్మలు చూపించి నాలుగేళ్లు కాలక్షేపం చేసి అన్నీ తాత్కాలిక కట్టడాలే చేపట్టారని విమర్శించారు. టీడీపీ సర్కారు తమను మోసం చేసిందన్నారు. ఉచిత విద్య, వైద్యం అంటూ వంచించారని, ప్లాట్ల పంపిణీలో గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు, లోకేష్, నారాయణ కమీషన్లు కాజేసి తొమ్మిది వేల ఎకరాలను ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా కారుచౌకగా కొనుగోలు చేశారని చెప్పారు. తమ అభ్యర్థన మేరకు ప్రతిపక్ష నేతగా ఉండగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిలో పర్యటిస్తే పసుపు నీళ్లు చల్లించారని, ఇప్పుడు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తాము అలాగే చేయాలా? అని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు