రుణమా(ఫీ)..హుళక్కేనా..!

16 Jul, 2014 04:28 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: ‘శుభకార్యానికి ఊరుబంతి పెడతాం.. ఇళ్లల్లో పొయ్యి వెలిగించొద్దంటూ దండోరా వేయించిన పెద్దమనిషి బియ్యంలో రాళ్లు ఏరివేసే దాకా ఆగండని ఊరి జనాల్ని రెండ్రోజులు పస్తులుంచాడంట...’  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ  తీరును ఇది ప్రతిబంబిస్తోంది. రైతుల పరిస్థితి నేడు మరీ దారుణంగా మారింది. అప్పులు కట్టాలంటూ వడ్డీ వ్యాపారులు, బ్యాంకర్ల ఒత్తిళ్లతో సమాధానం చెప్పలేక అన్నదాత బిక్కచచ్చిపోతున్నాడు.
 
పాత పంట రుణాలు మాఫీ చేసి.. కొత్త రుణాలందిస్తే పంటపెట్టుబడులొస్తాయని కలలుగన్న రైతుకు సర్కారు వైఖరి కన్నీటిని మిగులుస్తోంది.  రుణమాఫీ చేయకపోగా.. రీషెడ్యూల్ చేస్తామంటూ అదీ..కుటుంబానికి లక్షన్నర పరిమితితో ఆధార్‌కార్డు ఆధారంగా వర్తిస్తామంటూ పూటకో ప్రకటనలివ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువు మండలాల రైతులకే రీషెడ్యూల్ వర్తిస్తోందనే నిబంధనతో జిల్లాలో అధికమంది రైతులకు ఇక కొత్తరుణం పుట్టనట్టేనని తెలుస్తోంది.
 
అతివృష్టి లేదా అనావృష్టితో పంటలు దెబ్బతిని, బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే  ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటిస్తుంది. ప్రభుత్వం కోరితే ఈ కరవు మండలాల్లో రైతుల రుణాలను బ్యాంకులు రీషెడ్యూల్ చేస్తాయి. గత అక్టోబర్‌లో పైలిన్ తుపాను ప్రభావంతో నష్టం జరగ్గా దానిని ప్రామాణికంగా తీసుకున్న ప్రభుత్వం.. జిల్లాలో 56 మండలాలు ఉండగా, వాటిల్లో 45 మండలాలను తుపాను ప్రభావిత ప్రాంతాలుగా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.
 
కొన్నాళ్లకు మరో నాలుగింటిని కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రీషెడ్యూల్ చేయాల్సి వస్తే ఎంతమొత్తం అవుతుందనే అంచనాలు రూపొందించుకునేందుకు ప్రభుత్వం బ్యాంకులను లెక్కలు కోరింది. కరువు మండలాల జాబి తాను బ్యాంకులకు పంపింది. ఆయా మండలా ల్లో పంటరుణాలు తీసుకున్న రైతులెంతమంది.. ? తీసుకున్న రుణం ఎంత..? ఆఘమేఘాలమీద తెలపాలంటూ బ్యాంకులను కోరింది.
 
జిల్లా పరిస్థితిదీ.. తుపాను ప్రభావిత, కరువు మండలాల జాబితా ప్రకారం రుణాలు రీషెడ్యూల్ చేస్తే జిల్లా రైతులకు అన్యాయం జరిగే ప్రమాదముంది. మెజారిటీ మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చినా .. ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలనే కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. తుపానుతో మండలం మొత్తం నష్టపోనందున.. ఏఏ గ్రామా ల్లో నష్టం జరిగిందో ఆ ప్రాంతాలను కరువు ప్రభావితంగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా లో 1098 పంచాయతీలుండగా, వాటిల్లో 441 గ్రామాలను మాత్రమే కరువు గ్రామాలుగా గుర్తించారు. దీంతో కరువు గ్రామాలుగా గుర్తించిన ప్రాంత రైతుల రుణాలనే రీషెడ్యూల్ చేసి బ్యాంకులు కొత్తరుణాలు అందజేస్తాయి.

రీషెడ్యూల్ అంటే..?: బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాన్ని అదే ఏడాది చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రుణాలను రీషెడ్యూల్ చేస్తే తీసుకున్న రుణాన్ని 3 నుంచి 5 ఏళ్లలో వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు నూతనంగా అంతే మొత్తం రుణా న్ని పెట్టుబడి కోసం మళ్లీ ఇస్తారు.
 
కానీ, దీనికి (ముందుగా తీసుకున్న రుణానికి)ప్రస్తుతమున్న రేటు ప్రకారం 12.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పంటరుణం కాస్తా.. టర్మ్‌లోన్‌గా మారుతుంది. తర్వాత ఇచ్చే రుణం పంట రుణం అవుతోంది. రీషెడ్యూల్ చేస్తే బకాయిలను ప్రభుత్వం దశలవారీగా చెల్లించుకోవచ్చని భావిస్తోంది. ఒకవేళ రైతులు చెల్లించినా..వారి ఖాతాల్లో డబ్బు జమచేసే ఆలోచనలో ఉంది. ప్రభుత్వం వెంటనే స్పష్టతనిచ్చి రుణాలు మొత్తం మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు