కరువు రైతుకు కరెంట్‌ ‘షాక్‌’ 

7 Apr, 2019 12:30 IST|Sakshi

సాక్షి,  అనంతపురం అగ్రికల్చర్‌ : ఏటా కరువు దరువే.. వాన చినుకూ రాలని దయనీయం. కనీసం పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. అన్నదాతకే అన్నం పుట్టని పరిస్థితులు. కూలీలు, పేద వర్గాలు అత్యంత దుర్భర జీవితం గడుపుతున్న దుస్థితి. భరోసా కల్పించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. రైతులను రాచిరంపాన పెట్టింది. కరెంటు బిల్లుల షాకులిస్తూ కాల్చుకుతినింది. 1995–2003 మధ్య కాలంలో చంద్రబాబు చేసిన హైటెక్‌ పాలనలో రైతులు నరకయాతన అనుభవించారు.

ఈ కష్టాలు తీర్చు దేవుడా అని మొరపెట్టని వారు లేరు. ఈ క్రమంలోనే 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రైతుకు భరోసా కల్పించారు. అధికారంలోకి రాగానే విద్యుత్‌ బిల్లులు మాఫీతో పాటు ఉచిత విద్యుత్‌పై తొలిసంతకం చేసి అన్నదాతకు అండగా నిలిచారు.     

 తొమ్మిదేళ్ల చంద్రబాబు హైటెక్‌ పాలనలో రైతులు అష్టకష్టాలు పడ్డారు. వ్యవసాయం దండగ అని భావించిన చంద్రబాబు.. దేశానికి వెన్నెముకలా నిలిచే రైతన్నల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. కరువు కోరల్లో చిక్కుకున్న రైతులను ఆదుకోవాల్సింది పోయి... అణచివేత ధోరణి అవలంభించారు. వ్యవసాయ పథకాలు లేవు, ప్రోత్సాహకం అంతకన్నా లేదు. రాయితీల ఊసే లేదు. అంతా హైటెక్‌ యుగం. హామీలమయం. అందువల్లే అన్నదాతల అక్రందనలు మిన్నంటాయి.

అయినా అటు పాలకులు కాని ఇటు అధికారులు గానీ రైతుల గురించి పట్టించున్న పాపాన పోలేదు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లోనే రైతులు తొమ్మిదేళ్లు బతుకు సమరం చేశారు. 1995 నుంచి 2003 వరకూ కడు దుర్భర పరిస్థితులను అనుభవించారు. 

రైతులపై కేసులు 
చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో పాలన సాగించడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రైతు సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు.. కరెంటు చార్జీలను ఇష్టారాజ్యంగా పెంచేసి రైతులకు షాకులమీద షాకులిచ్చాడు. కరెంటు బిల్లులు నెలనెలా కట్టాల్సిందేనని ఉక్కుపాదం మోపారు. బిల్లులు కట్టని రైతులపై పోలీసులను ఉసిగొల్పారు. దీంతో పోలీసు అధికారులు అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా బోరుబావుల దగ్గరకు వెళ్లి మోటార్లు బలవంతంగా తీసుకెళ్లారు.

అంతేకాకుండా కరెంటు తీగలను తెంపి.. స్టాటర్లు పెట్టెలు ఎత్తుకెళ్లి కరెంటు ఆఫీసులు, పోలీసు స్టేషన్లలో పెట్టుకున్నారు. ఏమిటీ దురాగతం అని ప్రతిఘటించిన రైతులపై దాడి చేయడమే కాకుండా జైల్లో పెట్టించారు. కరెంటు బిల్లులు కట్టని 14,156 మంది రైతులపై చంద్రబాబు సర్కార్‌ కేసులు పెట్టించింది. 

26 మంది బలవన్మరణం 
పొలాల్లో కనిపించాల్సిన రైతులు.. చంద్రబాబు హయాంలో పోలీసు స్టేషన్‌ల వద్ద కనిపించారు. ‘కరెంటు’ బిల్లులు కట్టలేక...పోలీసు స్టేషన్‌ల చుట్టూ తిరగడం అవమానంగా భావించిన 26 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. మరోవైపు వర్షాలు లేక అప్పట్లో ఉన్న 1.35 లక్షల బోరుబావుల్లో నీళ్లు రాక 40 వేల బోర్లు నిలువునా ఎండిపోయాయి.

అయినా దయలేని చంద్రబాబు సర్కార్‌... బిల్లులు కట్టాల్సిందేనని రైతులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బోరులేదు, మోటారు లేదు... కేవలం కరెంటు సర్వీసు ఉన్న పాపానికి బిల్లులు చెల్లించాల్సిందేనని రాత్రిబవళ్లు ఒత్తిడి చేయడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇలా తొమ్మిదేళ్లు రైతుల రక్తం తాగింది చంద్రబాబు సర్కార్‌.  

నేనున్నా.. అంటూ వైఎస్‌ భరోసా 
వరుస కరువులు...టీడీపీ సర్కార్‌ దాష్టీకాలతో అష్టకష్టాలు అనుభవించిన రైతులు 2004లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు సరైన గుణపాఠం చెప్పారు. రైతు పక్షపాతి వైఎస్సార్‌కు పట్టం కట్టారు. ఆయన కూడా అధికారం చేపట్టిన మొదటి రోజే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రూ.1,295 కోట్లు కరెంటు బిల్లులన్నీ మాఫీ చేస్తూ తొలిఫైలుపై సంతకం చేశారు. మీకు అండగా నేనున్నా... అంటూ రైతుల్లో భరోసా నింపారు.

వైఎస్సార్‌ తొలి సంతకంతో జిల్లాలోని రైతులకు చెందిన రూ.70.65 కోట్ల విద్యుత్‌ బిల్లులు మాఫీ అయ్యాయి. అలాగే ఉచిత విద్యుత్‌ అందించి రైతుల్లో సంతోషం నింపారు. వైఎస్సార్‌ హయాంలో జిల్లా రైతులకు రూ.150 కోట్లు విలువ చేసే విద్యుత్‌ ఉచితంగా అందింది. రైతు కష్టం గురించి తెలిసిన వైఎస్సార్‌ తన హయాంలో రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

రైతులను అన్ని విధాలుగా గట్టెక్కించారు. వ్యవసాయం దండగ కాదు... పండుగంటూ ఆచరణ్మాతకంగా రుజువు చేశారు. ఉచిత విద్యుత్‌ అంటే కరెంటు తీగలపై బట్టలు అరేసుకోవాలి... అంటూ హేళన చేసిన టీడీపీ నేతలకు కనువిప్పు కలిగించారు.  

పల్లెల్లో పచ్చని కాంతులు 
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ముఖం చాటేసిన వరుణుడు కూడా వైఎస్సార్‌ అధికారం చేపట్టిన సంవత్సరం నుంచే కరుణించాడు. వైఎస్సార్‌ ప్రభుత్వం కూడా కులాలు మతాలకు అతీతంగా సన్న చిన్న కారు రైతులతో పాటు పెద్దరైతులను వెన్నుతట్టి పోత్సహించింది. పంటలు పండాయి. గిట్టుబాటు ధర లభించింది. మోడుబారిన పల్లెసీమలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. విద్యుత్‌ బిల్లులు మాఫీ, ఉచిత విద్యుత్‌తో అన్నదాతలు ఆనందంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి నెలకొంది. సమున్నత ఆశయం, మంచి చేయాలనే తపన ఉన్న మహానేత వైఎస్సార్‌కు ప్రకృతీ సహకరించడంతో రైతు రాజుగా వెలిగొందాడు.  

1995–2003 మధ్య చంద్రబాబు హయాంలో పెట్టిన కేసులు    : 14,156  
వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న రైతులు    : 26 మంది 
2004లో వైఎస్సార్‌ సీఎం కాగానే విద్యుత్‌ బిల్లులు మాఫీ    : రూ.70.65 కోట్లు 
వైఎస్సార్‌ హయాంలో ఉచిత విద్యుత్‌ సరఫరా విలువ    : రూ.150 కోట్లు  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు