ఏమిటో అభ్యంతరం

30 Apr, 2015 04:56 IST|Sakshi

తాడికొండ : రాజధాని రైతుల అభ్యంతరాలను సీఆర్‌డీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. అభ్యంతరాలను తెలుపుతూ అంజేసిన దరఖాస్తులను పరిశీలించడానికి ఉన్న అభ్యంతరం ఏమిటో కూడా వెల్లడికావడం లేదు.  నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా సీఆర్‌డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో జనవరి 2 తేదీ నుంచి ప్రభుత్వం భూ సమీకరణ ప్రారంభించి పూర్తి చేసింది. ఈ క్రమంలో రైతుల నుంచి 9.2 (అభ్యంతరం), 9.3(అంగీకారం) డిక్లరేషన్ పత్రాలను సేకరించింది.

ప్రభుత్వం 9.3 దరఖాస్తులకు ఇచ్చిన ప్రాధాన్యత అదే రైతుల నుంచి తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అందజేసిన 9.2 అభ్యంతరాల దరఖాస్తులను నేటికీ పరిశీలించడం లేదు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 33,400 ఎకరాల భూమిని సమీకరించిన ప్రభుత్వం వెను వెంటనే అనుకూల రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకొని కౌలు చెక్కులు అందజేయటమేకాక పొలాలను చదునుచేసే కార్యక్రమం చేపట్టింది.

ఇప్పటికి మూడునెలలు గడిచినా 9.2 దరఖాస్తులపై దృష్టి సారించలేదు. 9.2 దరఖాస్తులంటే భూ సమీకరణకు వ్యతిరేకమని భావిస్తున్న ప్రభుత్వం కనీసం ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో కూడా పట్టించుకోని స్థితిలో ఉంది. ఈ విషయమై సీఆర్‌డీఏ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా, వాటిపై ఇంకా చర్యలు తీసుకోలేదని మాత్రమే సమాధానమిస్తున్నారు. భూ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్న రాజధాని రైతుల దరఖాస్తులను ప్రభుత్వం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకుందో ఇట్టే అర్థమవుతోంది.
 
మూడు మండలాల నుంచి అధికంగా..
రాజధాని ప్రాంతంలో అధికంగా తుళ్లూరు మండలం జరీబు భూములతోపాటు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో రైతులు 9.2 దరఖాస్తులను అందజేశారు. వాటిపై ఇప్పటికే పరిశీలన పూర్తి చేసి రైతులకు తగిన సమాధానం ఇవ్వాల్సి ఉండగా, 9.3 దరఖాస్తులు వెనక్కి అడుగుతున్నారని అప్పట్లో ప్రభుత్వం ఎత్తుగడ వేసి 9.2 దరఖాస్తులను కూడా ఆయా గ్రామాల నుంచి తరలించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  

ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోవటంపై పలు విమర్శలు వస్తున్నాయి. నెల నుంచి రాజధాని పరిధిలో భూములిచ్చిన రైతులు తమ సమస్యలను పరిష్కరించటం లేదని కౌలు డీడీలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీంతో అధికారులే స్వయంగా ఫోనులు చేసి, రైతుల ఇళ్లకు వెళ్లి కౌలు డీడీలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
ప్రతి అంశం గోప్యమే...
మరో వైపు సీఆర్‌డీఏలో రైతులకు సంబంధించిన ప్రతి వ్యతిరేక అంశాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో రాజధాని ప్రాంత 29 గ్రామాల భూములకు సంబంధించిన అన్ని వివరాలను గోడ ప్రతుల ద్వారా పొందుపరుస్తామన్న సీఆర్‌డీఏ ఉప చైర్మన్, మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ మాటలు ఆచరణలో కానరావడం లేదు. భూ సమీకరణలోని భూముల వివరాలు అందరికి తెలిసేలా అందుబాటులో ఉంచాలని రైతు సంఘాల నాయకులు విన్నవించినా ప్రభుత్వానికి కనువిప్పు కలగటం లేదు.

మరిన్ని వార్తలు