ఆర్థిక సంక్షోభంలో రైతులు

26 Nov, 2014 01:49 IST|Sakshi

పర్చూరు : రైతులు పండించిన పంటకు ప్రభుత్వం కల్పిస్తున్న అతి తక్కువ ధర, వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతు వ్యతిరేక విధానాల కారణంగా అన్నదాతలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. పర్చూరు మండలంలోని నూతలపాడు, చింతగుంటపాలెం గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న పత్తి, మిరప, పొగాకు, మినుము పంటలను వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డితో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2,03,000 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 1,80,000 హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు సాగుచేశారని తెలిపారు. మిగిలిన 20 శాతం పొలాల్లో వర్షాభావం కారణంగా పంటలు సాగుచేయలేదని చెప్పారు. ఆ భూములన్నీ బీళ్లుగా మారాయన్నారు. జిల్లాలో 41,000 హెక్టార్లకుగానూ 70,000 హెక్టార్లలో పత్తి సాగుచేయగా, 40,000 హెక్టార్లకుగానూ 20,000 హెక్టార్లలో వరి, 20,000 హెక్టార్లకుగానూ 12,000 హెక్టార్లలో చిరుధాన్యాలు, 67,500 హెక్టార్లకుగానూ 47,500 హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగుచేస్తున్నారని వివరించారు.

ైవె ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తి క్వింటా ధర 7,800 రూపాయలుండగా ప్రస్తుతం 4,050 రూపాయలు మాత్రమే ఉందన్నారు. మద్దతు ధరకు సంబంధించి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. జిల్లాలో వ్యవసాయం ప్రధాన రంగంగా ఉన్నప్పటికీ ఆ రంగానికి సంబంధించిన పరిశోధనా కేంద్రాలు ఒక్కటి కూడా స్థానికంగా లేకపోవడం బాధాకరమని నాగిరెడ్డి పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబునాయుడు కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేస్తున్నారే తప్ప వారి సంక్షేమం కోసం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడం లేదని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో నూతలపాడు సహకార సంఘ అధ్యక్షుడు కుర్రి బాపిరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వల్లభరెడ్డి సుబ్బారెడ్డి, వణుకూరి బ్రహ్మారెడ్డి, బి.వెంకారెడ్డి, రామిరెడ్డి, మస్తాన్‌రెడ్డి, వై.రామారావు, వణుకూరి వెంకరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు